×
Ad

Tamil Nadu: ఎన్నికల ముందు రాజకీయాలను కుదిపేస్తున్న “కార్తీక దీపం” వివాదం.. తీర్పు ఇచ్చిన జడ్జిపై అభిశంసన నోటీసు.. ఏం జరుగుతోంది?

ఇప్పటివరకు ఏం జరిగింది? ఎన్నికల ముందు ఈ వివాదం మళ్లీ ఎలా రగిలింది?

Justice GR Swaminathan

Karthigai Deepam: తమిళనాడులో “కార్తీక దీపం” ఇష్యూ ఇప్పట్లో చల్లారేలాలేదు. తిరుప్పరంకుండ్రంలోని కొండపై ఉన్న ఉచ్చిపిళ్లైయార్‌ ఆలయంలో ప్రతి ఏడాది కార్తీక దీపాన్ని (కార్తిగై దీపం) వెలిగిస్తారు. ఆ ఆలయ కొండ పైభాగంలోని దీప స్తంభంలో మాత్రం కార్తీక దీపాన్ని వెలిగించడానికి వీలు లేకుండా నిషేధాజ్ఞలు ఉన్నాయి.

ఆ ప్రాంతంలో దర్గా కూడా ఉండడం ఇందుకు కారణం. ఆ దర్గాకు 15 మీటర్ల అవతల కార్తీక దీపం వెలిగించుకోవడానికి తమకు ఏ అభ్యంతరమూ లేదని దర్గా తరఫున వారు వెల్లడించారు. అయితే, దీప స్తంభంలోనూ కార్తీక దీపాన్ని వెలిగించడానికి హిందువులు పోరాడుతున్నారు. దీనిపై న్యాయస్థానాలను ఆశ్రయించారు. (Karthigai Deepam)

దీప స్తంభంలోనూ కార్తీక దీపాన్ని వెలిగించడానికి ఇటీవల మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ, అక్కడ దీపాన్ని వెలిగించేందుకు పోలీసులు అనుమతించడం లేదని వారం క్రితం బీజేపీ, హిందూ సంఘాలు నిరసన చేపట్టాయి.

మరోవైపు, కొన్నేళ్ల క్రితం మద్రాస్ హైకోర్టు ద్విసభ్య బెంచ్ దీప స్తంభం వద్ద దీపం వెలిగించరాదని తీర్పు ఇచ్చింది. దీంతో తాము ఆ తీర్పుకే కట్టుబడి ఉంటామని తమిళనాడులోని అధికార డీఎంకే చెబుతోంది.

ఎన్నికల వేళ “కార్తీక దీపం”పై రాజకీయాలు
మద్రాస్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ జీఆర్‌ స్వామినాథన్‌పై ప్రతిపక్ష ఎంపీలు అభిశంసన నోటీసు ఇచ్చారు. ఆయనను తొలగించాలని డీఎంకే నేతృత్వంలో వారు 100 మంది ఎంపీల సంతకాలతో కూడిన లేఖను లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఈ నోటీసులు అందించారు. దీపస్తంభంపై కార్తీక దీపం వెలిగించుకోవచ్చని తీర్పు ఇచ్చింది జస్టిస్‌ స్వామినాథనే.

విపక్ష ఎంపీలు ఈ నోటీసు ప్రతులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, భారత ప్రధాన న్యాయమూర్తికి కూడా పంపించారు. ఆ ఎంపీల్లో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అకిలేశ్ యాదవ్, డీఎంకే నేతలు టీఆర్ బాలు, కనిమొళి, ఎన్సీపీ ఎస్‌పీ ఎంపీ సుప్రియ సూలే, తదితరులు ఉన్నారు.

Also Read: తమిళనాడు ఎన్నికల ముందు అగ్గి రాజేస్తోన్న “కార్తీక దీపం” ఇష్యూ.. ఈ వివాదానికి వందేళ్లకు పైగా చరిత్ర

ఇప్పుడు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్ అభిశంసనను ఎదుర్కొంటున్నారు. అభిశంసన (ఇంపీచ్‌మెంట్) అంటే న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించేందుకు పార్లమెంట్‌లో చేపట్టే రాజ్యాంగ ప్రక్రియ.

కాగా, 2017లో ఇచ్చిన ధర్మాసన తీర్పు ప్రకారం దేవాలయ ఆచారాల్లో కోర్టు జోక్యం చేసుకోరాదని డీఎంకే, దాని మిత్రపక్షాలు వాదిస్తున్నాయి. ఈ నిర్ణయం సామాజిక ఉద్రిక్తతలకు దారి తీసే ప్రమాదం ఉందని, అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 6 నెలలు కూడా సమయం లేదని అన్నాయి. కాగా, జస్టిస్‌ స్వామినాథన్‌ ఇచ్చిన ఆదేశాలను డీఎంకే సర్కారు సుప్రీంకోర్టులో కూడా సవాలు చేసింది.

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్‌పై విపక్ష ఎంపీలు అభిశంసన నోటీసు ఇవ్వడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు చేశారు. న్యాయస్థాన తీర్పు కారణంగా న్యాయమూర్తిపై అభిశంసన తీసుకొస్తుండడం ఇదే తొలిసారి అని అన్నారు. ఇది బుజ్జగింపు రాజకీయాలకు ప్రతిబింబమని చెప్పారు.

56 మంది మాజీ న్యాయమూర్తుల బహిరంగ లేఖ
మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్‌పై విపక్ష ఎంపీలు అభిశంసన నోటీసు ఇవ్వడంలో 56 మంది మాజీ న్యాయమూర్తులు శుక్రవారం ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. జస్టిస్ జీఆర్ స్వామినాథన్‌పై అభిశంసన నోటీసు ఇవ్వడాన్ని వారు వ్యతిరేకించారు. ఒక వర్గ భావజాలం, రాజకీయ అంచనాలకు అనుగుణంగా లేని న్యాయమూర్తులను భయపెట్టే ప్రయత్నంగా విపక్ష ఎంపీల చర్యను 56 మంది మాజీ న్యాయమూర్తులు పేర్కొన్నారు.

బ్రిటిష్ కాలంలోనే ఈ సమస్యలు ఎలా ప్రారంభమయ్యాయి? వివాదం ఎందుకు మళ్లీ ఎలా రగిలింది? డీఎంకే ఏమంటోంది?

పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి