ఇగ్లూ కేఫ్ చూశారా, మంచు హోటల్లో వేడి వేడి ఆహారం

ever igloo restaurant : జమ్ముకశ్మీర్‌లో గుల్‌మర్గ్‌లోని కొల‌హోయి స్కీ రిసార్ట్ నిర్మించిన ఈ ఇగ్లూ కేఫ్ ఇప్పుడు ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్ అయిపోయింది. ఈ కేఫ్‌లో ఉన్న టేబుల్స్ కూడా మంచుతోనే చేసిన‌వి కావ‌డం విశేషం. చ‌ల్లని కేఫ్‌లో వేడివేడి ఆహార ప‌దార్థాల‌ను తిన‌డానికి టూరిస్టులు క్యూ క‌డుతున్నారు. 15 అడుగుల ఎత్తు, 26 అడుగుల చుట్టుకొల‌త‌తో నిర్మించిన ఈ ఇగ్లూ కేఫ్‌లో నాలుగు టేబుల్స్ ఉన్నాయి. ఒకేసారి 16 మంది కూర్చోవ‌చ్చు. ఈ కేఫ్ ముందు ఫొటోలు తీసిన టూరిస్టులు..వాటిని సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. అవి చూసి ఈ కేఫ్ గురించి ఆరా తీస్తున్న వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది.

మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే అతిశీతల ప్రాంతాల్లో..ఎస్కిమోలు అనే స్థానిక ప్రజలు నివసించే మంచు గృహాలను ఇగ్లూ అంటారు. యథాలాపంగా నిర్మించటం కాకుండా..ఇగ్లూలను ప్రత్యేక ఇంజనీరింగ్‌ నియమాల ప్రకారం రూపొందించాల్సి ఉంటుంది. మనదేశంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈ ఇగ్లూ కేఫ్‌ కూడా మంచు మయం అని చెప్పొచ్చు. ఇక లోపలికి వెళ్తే టేబుళ్ళు, కుర్చీలే కాకుండా అలంకరణకు వాడే వస్తువులు, ఫ్లవర్‌ వాజ్‌, టేబుల్‌ వంటి నిర్మాణం కూడా మంచుతోనే ఏర్పాటు చేశారు. అయితే, కూర్చునేందుకు అసౌకర్యం కలగకుండా దట్టమైన రగ్గు వంటి వస్త్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మంచు గడ్డ టేబుల్‌ మీద వేడి వేడి ఆహారం తినాలంటే చలో కశ్మీర్‌ అనాల్సిందే.