Kejriwal residence renovation costs skyrocket to Rs 33.66 crore Said CAG Report
CAG Estimated: దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులను ప్రకటించగా.. బీజేపీ తొలి విడత ఇరవై తొమ్మిది నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఇరు పార్టీల నేతల ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పై కాగ్ (CAG ) సంచలన నివేదిక ఇచ్చింది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికార నివాసం మరమ్మతుల కోసం అంచనా కంటే మూడు రెట్లు అధిక వ్యయం చేసినట్లు నివేదిక పేర్కొంది.
Also Read: Prashant Kishor: ప్రశాంత్ కిశోర్ అరెస్టు.. బెయిల్ దక్కినా జైలుకు పీకే?
అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నంబర్ 6, ఫ్లాగ్ స్టాఫ్ రోడ్డులోని అధికారిక బంగ్లాలో నివసించారు. ఆ సమయంలో దాని మరమ్మతుల కోసం ప్రాథమిక అంచనా వ్యయం రూ.7.91 కోట్లు కాగా.. 2020లో రూ. 8.62 కోట్లకు కాంట్రాక్టు ఇచ్చారు. 2022లో పీడబ్ల్యూడీ శాఖ పనులు పూర్తిచేసే నాటికి ఆ ఖర్చు మూడు రెట్లు పెరిగి మొత్తం బంగ్లా మరమ్మతుల ఖర్చు రూ. 33.36కోట్లకు చేరుకుందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అంచనా వేసింది.
Also Read: HMPV Virus : భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం.. ఇద్దరు చిన్నారులకు పాజిటివ్.. అప్రమత్తమైన కేంద్రం
2020లో ముఖ్యమంత్రి నివాసంలో కొనుగోలు చేసిన వస్తువులకు, సౌకర్యాలకు కూడా భారీ ఖర్చు అయినట్లు కాగ్ పేర్కొంది. అందులో 88 అంగుళాల ఓఎల్సీడీ టీవీ కోసం రూ. 28.9లక్షలు, పది ఇతర ఓఎల్సీడీ టీవీలకోసం రూ. 43.9 లక్షలు, శాంసంగ్ కంపెనీకి చెందిన రిఫ్రిజిరేటర్ కోసం రూ. 3.2లక్షలు, మైక్రోవేవ్ ఓవేన్ రూ. 1.8లక్షలు, రెండు స్టీమ్ ఓవెన్ లు రూ. 6.5లక్షలు, ఫ్రంట్ లోడింగ్ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ రూ. 1.9లక్షలు, 10 బెడ్లు, సోఫాలుకు రూ. 13లక్షలు, కర్టెన్లపై రూ.96లక్షలు, మార్బుల్స్ పై రూ. 67లక్షలు ఖర్చు చేశారు. అదేవిధంగా పబ్లిక్ వర్క్ డిపార్ట్‌మెంట్ (PWD) రూ. 19.5 లక్షలతో బాత్ టబ్, స్పా బెడ్స్, తదితర వాటికోసం ఖర్చు చేయగా.. బంగ్లాలో పనివారికోసం ఏడు క్వార్టర్ల నిర్మాణానికి అదనంగా రూ.19.8 కోట్లు వెచ్చించినట్లు కాగ్ తన నివేదికలో పేర్కొంది.
ఇదిలాఉంటే.. టెండరింగ్ ప్రక్రియ గురించి కూడా కాగ్ ప్రశ్నలను లేవనెత్తింది. ఐదుగురు కాంట్రాక్టర్ల నుండి 2020 అక్టోబర్ లో టెండర్లు ఆహ్వానించడం జరిగిందని, అయితే, ముగ్గురు మాత్రమే బిడ్ లను సమర్పించారని, వారు కూడా ఈ పనులకు అర్హత కలిగిన కాంట్రాక్టర్లు కాదని నివేదికలో పేర్కొంది. అయితే, అవసరమైన పత్రాలను సమర్పించడంలో ఢిల్లీ ప్రభుత్వం విముఖత చూపిందని కాగ్ తెలిపింది. సరఫరా వోచర్ లు, చలాన్లు లేనందున, సరఫరా చేయబడిన మెటీరియల్ కు ప్రామాణికత, వాటి ధరలను ధృవీకరించడం సాధ్యం కాలేదని పేర్కొంది.
సెప్టెంబర్ 2024 వరకు అరవింద్ కేజ్రీవాల్ ఆ బంగ్లాలోనే నివాసం ఉన్నారు. దీంతో ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ గత మూడు రోజల్లో ఈ అంశాన్ని రెండుసార్లు లేవనెత్తారు. కరోనా మహ్మారి సమయంలో ప్రజలంతా ఇబ్బంది పడుతున్న సమయంలో కేజ్రీవాల్ మాత్రం అద్దాల ప్యాలెస్ నిర్మించారని విమర్శించారు. మొత్తానికి ముఖ్యమంత్రి భవనం మరమ్మతుల కోసం భారీ ఖర్చు చేశారంటూ కాగ్ ఇచ్చిన నివేదిక బీజేపీ ఆస్త్రంగా మారగా.. బీజేపీ నేతల విమర్శలను ఆప్ నేతలు తిప్పికొడుతున్నారు.