Prashant Kishor: ప్రశాంత్ కిశోర్ అరెస్టు.. బెయిల్ దక్కినా జైలుకు పీకే?
షరతులతో కూడిన బెయిల్‌ను ప్రశాంత్ కిశోర్ అంగీకరించడం లేదని జాతీయ మీడియా పేర్కొంటోంది.

Prashant Kishor
నిరవధిక నిరాహార దీక్షకు దిగిన జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనకు కోర్టులో బెయిల్ లభించింది. బిహార్ సివిల్ సర్వీసెస్ (బీపీఎస్‌సీ) పరీక్షను రద్దు చేయాలంటూ విద్యార్థులతో కలిసి ప్రశాంత్ కిశోర్ నిరశన దీక్షకు దిగిన విషయం తెలిసిందే.
ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలతో ప్రశాంత్ కిశోర్ ఈ దీక్షకు దిగారు. గురువారం నుంచి ప్రశాంత్ కిశోర్ దీక్షలో పాల్గొంటున్నారు. ఆయనను పోలీసులు అరెస్టు చేశాక, ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు వెళ్లారు. ప్రశాంత్ కిశోర్‌కు పాట్నా సివిల్ కోర్టు రూ.25000 వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది.
షరతులతో కూడిన బెయిల్‌ను అందించి, పీఆర్ బాండ్‌ను అందించాలని సూచించింది. అయితే, షరతులతో కూడిన బెయిల్‌ను ప్రశాంత్ కిశోర్ అంగీకరించడం లేదని జాతీయ మీడియా పేర్కొంటోంది. కోర్టు నిబంధనలను పాటించడానికి నిరాకరిస్తే జైలుకు వెళ్లే అవకాశం ఉంది. కిశోర్‌కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంపై ప్రశాంత్ కిశోర్ తరపు న్యాయవాది శివానంద్ గిరి మీడియాతో మాట్లాడారు.
తమ వాదనలను కోర్టు అంగీకరించినప్పటికీ కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేసినట్లు గిరి తెలిపారు. కోర్టు ఆదేశానుసారం.. ప్రశాంత్ కిశోర్ పబ్లిక్ ఆర్డర్‌కు భంగం కలిగించేలా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా భవిష్యత్తులో ఎలాంటి నిరసనలు, ప్రదర్శనల్లో పాల్గొనకుండా ఉండాలని అన్నారు. అయితే, బెయిల్ మంజూరు అయినప్పటికీ, కిశోర్ షరతులను అంగీకరించడానికి నిరాకరించారని, ఇప్పటికీ కోర్టులో ఉన్నారని చెప్పారు.