పార్టీలకు ఆ ఈసీ వార్నింగ్ : ప్రచారంలో ప్లాస్టిక్ వాడొద్దు

సార్వత్రిక ఎన్నికల సమయాన కేరళలోని తిరువనంతపురం జిల్లా ఎన్నికల అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్యావరణ పరిరక్షణపై ఫోకస్ పెట్టారు. పర్యారణానికి హాని కలగకుండా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. రాజకీయ పార్టీల నాయకులకు, ఎన్నికల్లో పోటీ అభ్యర్థులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. హరిత కేరళ, సుచిత్వా మిషన్ లో భాగంగా ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధించారు. ఎక్కడా ప్లాస్టిక్ కనిపించకూడదన్నారు. అభ్యర్థులు తమ ప్రచారాల్లో ప్లాస్టిక్‌ను వాడొద్దని చెప్పారు. ప్లాస్టిక్ బదులు పేపర్, క్లాత్ ను మాత్రమే వినియోగించాలన్నారు. ప్రతి పార్టీ.. గ్రీన్ ప్రోటోకాల్ ను పాటించాల్సిందే అని అధికారులు స్పష్టం చేశారు.
పార్టీలు, అభ్యర్థులతో పాటు ప్రజలు కూడా సహకరించాలని.. పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించాలని జిల్లా అధికారులు కోరారు. క్లాత్ తో చేసిన హోర్డింగ్స్, బ్యానర్లే వినియోగించాలన్నారు. ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ (క్లాత్, పేపర్ మెటీరియల్) తో చేసిన వాటినే ప్రచార వాహనాలకు వాడాలన్నారు. అంతేకాదు.. ప్రచారం సమయంలో తాగునీరు అందించేందుకు ప్లాస్టిక్ గ్లాసులకు బదులు స్టీల్ లేదా గ్లాజు గ్లాసులే వాడాలన్నారు. భూమిలో సులభంగా కలిసిపోయే వాటినే ఉపయోంచాలన్నారు.
రోజురోజుకి పర్యావరణ కాలుష్యం పెరిగిపోతోంది. గాలి, నీరు, భూమి కలుషితమైపోతున్నాయి. దీంతో పర్యావరణ పరిరక్షణ కోసం కేరళ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎన్నికల సమయంలో కాలుష్యం గణనీయంగా పెరిగిపోతోంది. దీని నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. గ్రీన్ ప్రోటో కాల్ కు ప్రతి ఒక్కరు సహకరించాలని అధికారులు కోరారు.