Kerala Governor directs VCs of 9 universities to resign by Monday
Kerala: సోమవారంలోగా రాజీనామా చేయాలంటూ 9 యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లకు కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆదేశాలు జారీ చేశారు. గవర్నర్ జారీ చేసిన ఈ ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని కేరళ రాజ్ భవన్ ఆదివారం విడుదల చేసింది. అక్టోబరు 24వ తేదీ ఉదయం 11:30 గంటలలోపు తమ రాజీనామాను సమర్పించాలని కేరళలోని 9 విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లను ఆదేశిస్తూ ఒక లేఖ జారీ చేశారు. ఈ లేఖ సంబంధిత వర్సిటీల వీసీలు, రిజిస్ట్రార్‌లకు ఈమెయిల్ కూడా పంపినట్లు పేర్కొన్నారు.
ఈ జాబితాలో యూనివర్సిటీ ఆఫ్ కేరళ, మహాత్మ గాంధీ యూనివర్సిటీ, కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిఝరీస్ అండ్ ఓసియన్ స్టడీస్, కన్నూర్ యూనివర్సిటీ, ఏపీజే అబ్దుల్ కలాం టెక్నాలజికల్ యూనివర్సిటీ, శ్రీ శంకరాచార్య యూనివర్సిటీ ఆఫ్ సంస్క్రిట్, యూనివర్సిటీ ఆఫ్ కాలికట్, థంచాత్ ఎజుతాచన్ మలయాళం యూనివర్సిటీలు ఉన్నాయి. డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం టెక్నికల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా డాక్టర్ రాజశ్రీ ఎంఎస్ నియామకాన్ని సుప్రీంకోర్టు గతంలో రద్దు చేసింది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ ప్రకారం, సెర్చ్ కమిటీ వీసీ పదవికి ముగ్గురికి తక్కువ కాకుండా అర్హత గల వ్యక్తులతో కూడిన ప్యానెల్‌ను సిఫారసు చేయాల్సి ఉండగా, రాజశ్రీ విషయంలో ఆమె పేరు మాత్రమే సిఫార్సు చేయబడింది.
గవర్నర్‌కు వ్యతిరేకంగా నవంబర్‌లో అధికార ఎల్‌డిఎఫ్ వరుస నిరసనలను ప్రకటించిన కొద్ది సమయానికి ఈ ప్రకటన వచ్చింది. కాగా, ఈ విషయమై కేరళ ఎమ్మెల్యే ఎంపీ గోవిందన్ స్పందిస్తూ “తాను ఆర్‌ఎస్‌ఎస్ మద్దతుదారునిగా ప్రకటించుకునేందుకు గవర్నర్ ప్రయత్నిస్తున్నారు. యూనివర్శిటీ విషయంలో గవర్నర్ జోక్యం నిరంకుశత్వంగా ఉంది. ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులను తీసుకురావడానికి సెనేట్ సభ్యులను ఉపసంహరించుకున్నారు. ఉన్నత విద్యా రంగాన్ని నియంత్రించేందుకు గవర్నర్ ప్రయత్నించారు’’ అని అన్నారు.