CAA అమలుకు నిరసనగా కేరళ కిడ్స్ వినూత్న సంఘీభావం!

  • Published By: sreehari ,Published On : December 28, 2019 / 09:36 AM IST
CAA అమలుకు నిరసనగా కేరళ కిడ్స్ వినూత్న సంఘీభావం!

Updated On : December 28, 2019 / 9:36 AM IST

పౌరసత్వ సవరణ చట్టం (CAA)ని వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. అసోం సహా ఇతర రాష్ట్రాల్లో కూడా CAA వ్యతిరేక సెగ తగిలింది. CAA, NRC అమలును నిరసిస్తూ తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తున్నారు. సీఏఏను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

CAA అమలుతో దేశంలోని ముస్లింలు ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందంటూ ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ సైతం ముస్లింలకు ఎలాంటి భయం అక్కర్లేదని భరోసా కల్పించిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో సీఏఏ ఆందోళనకారులకు కేరళకు చెందిన యువతీ యువకులు వినూత్న రీతిలో సంఘీభావం తెలిపారు. క్రిస్మస్ పురస్కరించుకుని ముస్లింల వేషధారణలో మద్దతు పలికి అందరి దృష్టిని ఆకర్షించారు.

యువతీయువకులంతా కలిసి నిలబడి క్రిస్మస్ కరోల్స్ పాటలు పాడుతూ ఆందోళనకారులకు తమ సంఘీభావాన్ని తెలియజేశారు. యువకులు తలపై టోపీలు ధరించగా.. అమ్మాయిలంతా తలపై స్కార్ఫ్ ధరించి క్రిస్మస్ కరోల్ సర్వీసు అందించారు. ఈ ఘటన కేరళలోని కొజెన్ చెర్రీలో మార్థోమా చర్చీలో క్రిస్మస్ కరోల్ సర్వీసు సందర్భంగా ఇలా వినూత్న ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.

ఈ కరోల్ సర్వీసు వీడియోను ట్విట్టర్ ద్వారా షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. ‘ఇది ఇండియా.. మన మతాల ఐక్యమత్యాన్ని ఎవరూ ఆపలేరు. Xmas కరోల్ సర్వీసులో భాగంగా ఈ యువతీ యువకులంతా మతానికి అతీతంగా CAA & NRC ఆందోళనలకు, భారతీయ ముస్లింలకు ఎలా సంఘీభావం తెలియజేస్తున్నారో చూడండి’ అని ఒకరు ట్వీట్ చేశారు.

కరోల్ సర్వీసులో భాగంగా అబ్బాయిలంతా తలకు టోపీలు, అమ్మాయిలంత తలకు స్కార్ఫ్ ధరించి ఉండటాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. ఇదే వీడియోను తిరువనంతపురం లోక్ సభ, పార్లమెంటు సభ్యులు శశి థరూర్ కూడా షేర్ చేశారు. ఆ తర్వాత ఈ వీడియోను ట్విట్టర్ యూజర్లు మరిన్ని షేర్లు చేయడంతో వైరల్ అవుతోంది. భారతీయ ముస్లింలకు మద్దతు పలికే యువతీ యువకులను ప్రశంసలతో ముంచెత్తారు.