Kerala To Turn Old Ksrtc Buses Into Classrooms For School Children
Kerala Govt : కేరళ ప్రభుత్వం ఏం చేసినా దాంట్లో ఓ చక్కటి ప్రయోజనం ఉంటుంది. అటువంటిదే మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. కాలం చెల్లిన బస్సులు నిరుపయోగంగా పడి ఉండటం కంటే వాటిని క్లాసు రూములుగా మార్చాలని నిర్ణయించింది. అంటే పాడైపోయిన బస్సులను క్లాసు రూములుగా మార్చి అందుబాటులోకి తీసుకురావాలని కేరళ రవాణా శాఖ నిర్ణయించింది.
కోవిడ్ సమయంలో లాక్ డౌన్ సందర్భంగా కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) బస్సులను తిరిగి రోడ్డుపైకి తెచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అవి రోడ్లపై తిరగటానికి ఏమాత్రం ఉపయోగకరంగా లేవు. దీంతో వాటిని ఆయా డిపోల్లోనే ఉంచేసింది రవాణాశాఖ. ఈ బస్సులను స్క్రాప్‌లుగా విక్రయించడం కంటే వాటిని దేనికైనా ఉపయోగించాలనే నిర్ణయించామని మంత్రి ఆంటోనీ రాజు తెలిపారు.ఈ నిర్ణయం గురించి మంత్రి ఆంటోనీ మాట్లాడుతూ..కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ పరిధిలో కాలం చెల్లిన బస్సులను తుక్కు చేయడం కంటే తరగతి గదులుగా వినియోగిస్తే బాగుంటుందని ఆలోచన వచ్చిందని..దీనికి గురించి నిర్ణయం కూడా తీసుకున్నామని తెలిపారు.
లో ఫ్లోర్ బస్సులన్నింటినీ క్లాస్ రూమ్‌లుగా మార్చడంతో పిల్లలకు కూడా కొత్త అనుభూతి కలుగుతుందన్నారు. మొదటగా రెండు లో ఫ్లోర్ బస్సులను కేరళ రాజధాని తిరువనంతపురంలోని ప్రభుత్వ స్కూల్లో ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం అన్ని పాఠశాలలకు విస్తరిస్తామని చెప్పారు. మొత్తం 400 బస్సులను తరగతి గదులుగా మార్చనున్నారు. ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టింది మరెవరో కాదు..రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వి. శివన్‌కుట్టి. ఆయనకు వచ్చిన ఈ ఆలోచనను రవాణాశాఖ తక్షణమే ఆమోదించిందని మంత్రి ఆంటోని తెలిపారు.