గుజరాత్ మాజీ సీఎం కన్నుమూత…ప్రధాని సంతాపం

Keshubhai Patel Dies at 92 బీజేపీ సీనియర్ నేత,గుజరాత్ మాజీ సీఎం కేశూభాయ్ పటేల్(92) కన్నుమూశారు. గుండెపోటుతో అపస్మారకస్థితిలోకి వెళ్లిన కేశూభాయ్‌ని ఇవాళ ఉదయం ఆయన కుటుంబసభ్యులు అహ్మదాబాద్‌లోని స్టెర్లింగ్ ఆస్పత్రిలో చేర్చించారు. అయితే,ఆయనను కోలుకునేలా చేసేందుకు డాక్టర్లు చాలాప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇవాళ ఉదయం 11:55సమయంలో ఆయన కన్నుమూసినట్లు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.



కాగా,గత నెలలో కేశూభాయ్ పటేల్ కరోనాని జయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కరోనా కారణంగా చనిపోయారంటూ వస్తున్న పుకార్లను డాక్టర్లు కొట్టిపారేశారు. కేశూభాయ్ కరోనా కారణంగా చనిపోలేదని డాక్టర్లు సృష్టం చేశారు.



కేశూభాయ్ పటేల్ మృతి పట్ల ప్రధాని సహా పలువురు నాయకులు,ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తనతో సహా చాలామంది యువ కార్యకర్తలకు కేశూభాయ్ మెంటార్ గా ఉండి విజయతీరాలవైపు తమని నడిపించారని ప్రధాని ట్వీట్ చేశారు. ఆయన మరణం తీరని లోటు అని పేర్కొన్నారు. కేశూభాయ్ పటేల్ కుమారుడు భరత్ తో తాను ఫోన్ లో మాట్లాడినట్లు మోడీ చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.



1928లో జునాగఢ్ జిల్లాలోని విసావాదర్ పట్టణంలో పుట్టిన కేశూభాయ్ పటేల్… 1945లో ఆర్ఎస్ఎస్‌ ప్రచారక్‌గా చేరారు. 1960ల్లో జన్‌సంఘ్ వ్యవస్థాపక సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1995లో తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఆయన ఏడు నెలల తర్వాత శంకర్‌సింఘ్ వాఘేలా తీరుగుబాటు చేయటంతో రాజీనామా చేశారు. 1998 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిచిన తర్వాత కేశూభామ్ రెండోసారి సీఎం అయ్యారు. అయితే.. 2001లో ఆయన మళ్లీ సీఎం పదవికి రాజీనామా చేశారు. అప్పుడు నరేంద్రమోడీ తొలిసారి గుజరాత్ సీఎం అయ్యారు.



కేశూభాయ్ 2012లో బీజేపీ నుంచి బయటకు వచ్చి గుజరాత్ పరివర్తన్ పార్టీ పేరుతో సొంత పార్టీ స్థాపించారు. కానీ ఆయన పార్టీ 2012 ఎన్నికల్లో ప్రభావం చూపించలేకపోయింది. ఆ తర్వాత మహాగుజరాత్ పార్టీని కలుపుకుని తన పార్టీని విస్తరించారు. అయితే.. 2014 ఫిబ్రవరిలో తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. మొత్తంగా ఆరుసార్లు గుజరాత్ ఎమ్మెల్యేగా కేశూభాయ్ పటేల్ గెలిచారు.