PM Modi America Tour
India and America: ప్రధాని నరేంద్ర మోదీ వచ్చేవారం అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో ఇరుదేశాలకు సంబంధించి పలు అంశాలపై చర్చించనున్నారు. ఈ క్రమంలో అమెరికా, భారత్ సంయుక్తంగా యుద్ధ విమాన ఇంజిన్‌లను తయారు చేసేందుకు అంగీకరించే అవకాశం ఉందని తెలిసింది. ఇందుకు సంబంధించిన డీల్ ముగింపు దశలో ఉంది. మోదీ అమెరికా పర్యటన సమయంలో డీల్ ప్రక్రియ పూర్తవుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఇందుకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచారు.
తేజస్ తేలికపాటి యుద్ధ విమానంకోసం ప్రభుత్వ యాజమాన్యంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌తో ఇంజన్‌లను ఉత్పత్తి చేసేందుకు మసాచుసెట్స్‌కు చెందిన ఏరోస్పేస్ తయారీ దిగ్గజం జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ ప్రతిపాదనను వైట్‌హౌస్ క్లియర్ చేయనుంది. చైనా నుంచి పెరుగుతున్న ముప్పుగా భావించే వాటిని ఎదుర్కోవడానికి కీలమైన దేశాలతో తన సంబంధాన్ని మరింతగా పెంచుకోవడానికి అమెరికా దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో భారత్, అమెరికా దేశాల మధ్య సైనిక సహకారానికి సంకేతంగా అమెరికా, భారత్ సంయుక్తంగా యుద్ధ విమాన ఇంజిన్‌లను తయారు చేసేందుకు అంగీకరిస్తాయని సమాచారం.
పీఎం నరేంద్ర మోదీ జూన్ 21న అమెరికా పర్యటనకు వెళ్తారు. 24వరకు మోదీ అమెరికా పర్యటన కొనసాగుతుంది. అధ్యక్షుడు జో బిడెన్ ప్రధాని మోదీకి వైట్‌హౌస్‌లో విందుకోసం ఆతిథ్యం ఇవ్వనున్నారు. అంతేకాక, ప్రధాని మోదీ యూఎస్ కాంగ్రెస్‌లోకూడా ప్రసంగిస్తారు. అమెరికా నుండి సాంకేతికత బదిలీ అవసరమయ్యే జెట్ ఇంజిన్ ఒప్పందానికి యూఎస్ కాంగ్రెస్ నుండి ఆమోదం అవసరం. ఈ క్రమంలో భారతదేశం సంబంధాలలో సాధారణ పెరుగుదల, మిగిలిన అడ్డంకులను క్లియర్ చేయడానికి మోదీ అమెరికా పర్యటన ఉపయోగపడనుంది.