రాష్ట్రపతి భవన్ లో డచ్ రాజదంపతులకు సాదరస్వాగతం

5 రోజుల భారత పర్యటన కోసం ఆదివారం అర్థరాత్రి ఢిల్లీకి చేరుకున్న డచ్ రాజదంపతులు విలియమ్ అలగ్జాండర్,మాక్సియా ఇవాళ(అక్టోబర్-14,2019)ఉదయం రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు. రాష్ట్రపతి భవన్ లో డచ్ రాజదంపతులకు ఘనస్వాగతం లభించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్,ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాజదంపతులకు సాదరస్వాగతం పలికారు.2013లో నెదర్లండ్స్ సింహాసనం అధిరోహించిన తరువాత విలియమ్ అలెగ్జాండర్ భారతదేశానికి మొదటిసారిగా వచ్చారు. 

ఢిల్లీలో జరిగే 25వ టెక్నాలజీ సమ్మిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజదంపతులు పాల్గొంటారు. ఈ సమ్మిట్ లో నెదర్లాండ్స్(డచ్) భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. ఢిల్లీలో అధికారిక ప్రోగ్రామ్స్ తర్వాత ముంబై,కేరళలో పర్యటించనున్నారు రాజదంపతులు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య ఆర్థిక, రాజకీయ సహకారాన్ని పెంచుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. 

భారత్-నెదర్లాండ్స్ ద్వైపాక్షిక వాణిజ్య టర్నోవర్ 12.87 బిలియన్ డాలర్లు (2018-2019). 2000 మరియు 2017 మధ్య 23 బిలియన్ డాలర్ల పెట్టుబడితో నెదర్లాండ్స్ భారతదేశంలో 5వ అతిపెద్ద పెట్టుబడిదారుగా ఉన్న విషయం తెలిసిందే.