Kushboo Sundar Suresh Gopi Files Nomination1
Kushboo, Suresh Gopi తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ సినీనటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ గురువారం(మార్చి-18,2021) తన నామినేషన్ దాఖలు చేశారు. థౌజండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆమె నామినేషన్ వేశారు. నామినేషన్ వేయడానికి ముందు ఖుష్బూ సుందర్ వల్లువరుకోట్టంలో రోడ్ షో నిర్వహించారు. ఇందులో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ ర్యాలీకి ప్రజలు భారీ స్థాయిలో తరలివెళ్లారు.234 శాసనసభ నియోజకవర్గాలున్న తమిళనాడులో ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.
మరోవైపు, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ప్రముఖ మళయాల నటుడు సురేష్ గోపి. త్రిసూర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా గురువారం సురేష్ గోపి నామినేషన్ దాఖలు చేశారు. తన అభిమానులకు దగ్గర ఉండాలని భావిస్తున్నట్లు ఓ వీడియో సందేశంలో సురేష్ గోపి పేర్కొన్నారు. నిజానికి తనకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని లేదని, కానీ అధిష్టానం సూచన మేరకు పోటీలోకి దిగుతున్నట్లు ఇటీవల సురేశ్ గోపీ తెలిపారు.
నాలుగు స్థానాల నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇచ్చారని, కానీ మోడీ నిర్ణయం ప్రకారమే తాను త్రిసూర్ నుంచి పోటీ చేస్తున్నట్లు సురేష్ గోపి వెల్లడించారు. కాగా, గత కొన్ని రోజుల నుంచి కొచ్చిలో ఆయన న్యూమోనియా చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్-6న కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే-2న ఫలితాలు వెలువడనున్నాయి.