Lakhimpur Case
Lakhimpur Case : దేశవ్యాప్తంగా సంచలనం రేసిన లఖింపూర్ హింసాకాండ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చార్జిషీట్ నమోదు చేసింది. యూపీలోని లఖింపూర్ ఖేరి జిల్లా టికునియా గ్రామంలో హింసాకాండ జరిగిన దాదాపు మూడు నెలలకు సిట్ ఈ ఛార్జిషీటు నమోదు చేసింది. 5,000 పేజీల చార్జిషీట్‌లో మొత్తం 14 మంది పేర్లు సిట్ నమోదు చేసింది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా పేరును ప్రధాన నిందితుడిగా చార్జిషీట్‌లో పేర్కొంది సిట్ బృందం.
ఇందులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తేనీ బంధువు వీరేంద్ర కుమార్ శుక్లా పేరు చేర్చారు. వీరేంద్ర కుమార్ శుక్లాపై ఐపీసీ సెక్షన్ 201 కింద సాక్ష్యాలను ధ్వంసం చేయడంపై అభియోగాలు నమోదు చేశారు. కాగా,లఖింపూర్ ఘటన ప్రమాదం కాదని, పథకం ప్రకారం జరిగిన కుట్ర అని సిట్ చార్జిషీట్ లో పేర్కొంది. ‘ముందస్తు కుట్ర’లో భాగంగా జరిగిన హింసాకాండలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయినట్టు సిట్ తన నివేదికలో పేర్కొంది. ఇది నిర్లక్ష్యం వల్ల జరిగిన ఘటన కాదని, కేవలం చంపాలనే ఉద్దేశంతోనే నిందితులు ఈ చర్యకు పాల్పడ్డారని తెలిపింది. ఈ కేసులో నిందితులపై ఉన్న సెక్షన్లను మార్చాలని సిట్ అధికారులు కోర్టును అభ్యర్థించారు. ఇక, ఇప్పటి వరకు నిందితులకు చార్జిషీట్ చూపించలేదు. ఛార్జిషీటును కోర్టు పరిగణనలోకి తీసుకున్న వెంటనే, సెక్షన్ 309 కింద నిందితులందరినీ కోర్టుకు పిలిపించి, చార్జ్ షీట్ కాపీని అందజేస్తారని అధికారులు తెలిపారు.
కాగా, గతేడాది అక్టోబర్ 3న లఖింపూర్ ఖేరి జిల్లా టికునియా గ్రామంలో యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటనకు నిరసగా ఆందోళనకు దిగిన రైతులపై వాహనం నడపడంతో నలుగురు రైతులు,ఒక జర్నలిస్టు మృతి చెందారు. ఈ ఘటన అనంతరం జరిగిన హింసాకాండలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు కూడా ప్రాణాలు కోల్పోయారు.
అయితే, కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రానే వాహనంతో రైతులపైకి దూసుకెళ్లారనే ఆరోపణలు రావడంతో ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే ఆశిష్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. మిశ్రాతో పాటు మరికొందరిని కూడా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా ప్రస్తుతం లఖింపూర్ ఖేరి జైలులో ఉన్నారు.కాగా, ఆశిష్ మిశ్రా దాఖలు చేసుకున్న బెయిల్ అప్లికేషన్‌పై అలహాబాద్ హైకోర్టు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇతర నిందితులు దాఖలు చేసుకున్న పిటిషన్లు లఖింపూర్ ఖేరి స్థానిక కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.
ALSO READ Nirmala Sitharaman : నిర్మలా సీతారామన్‌తో ముగిసిన ఏపీ సీఎం జగన్ భేటీ