Tej Pratap Yadav: లాలూ కుటుంబంలో సోషల్ మీడియా పోస్ట్ చిచ్చు.. కన్న కొడుకునే పార్టీ నుంచి బహిష్కరించిన తండ్రి..

తాను రిలేషన్‌షిప్‌లో ఉన్నానంటూ ఫేస్ బుక్ లో తేజ్ ప్రతాప్ యాదవ్ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

Tej Pratap Yadav: బీహార్ ఎన్నికల వేళ లాలూ కుటుంబంలో కలహాలు బయటపడ్డాయి. ఒక సోషల్ మీడియా పోస్ట్ చిచ్చు రాజేసింది. కన్న కొడుకునే పార్టీ నుంచి బహిష్కరించారు తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్. కొడుకు తేజ్ ప్రతాప్ సింగ్ ను పార్టీ నుంచి బహిష్కరించారు లాలూ ప్రసాద్ యాదవ్. ఆర్జేడీ నుంచి తేజ్ ప్రతాప్ సింగ్ ను ఆరేళ్ల పాటు బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నుంచే కాదు తేజ్ ప్రతాప్ సింగ్ ను కుటుంబం నుంచి కూడా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు లాలూ. తేజ్ ప్రతాప్ యాదవ్ బాధ్యత లేకుండా ప్రవర్తించాడని మండిపడ్డారు లాలూ ప్రసాద్ యాదవ్.

తన పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌ ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు ఆయన తండ్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. తన కొడుకు వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలను విస్మరించేలా చేస్తున్న చర్యలు.. సామాజిక న్యాయం కోసం పార్టీ చేస్తున్న పోరాటాన్ని బలహీనపరుస్తున్నాయని లాలూ వాపోయారు. తేజ్ ప్రతాప్ ప్రవర్తన కుటుంబ విలువలు, సంప్రదాయాలకు విరుద్ధంగా ఉందని సీరియస్ అయ్యారు. ఈ కారణాలతో అతడిపై వేటు వేసినట్లు వివరించారు. ఇకపై తేజ్‌ ప్రతాప్‌కు ఆర్జేడీ పార్టీలో, తమ కుటుంబంలో స్థానం లేదని స్పష్టం చేశారు లాలూ ప్రసాద్ యాదవ్.

అసలేం జరిగిందంటే..
తాను రిలేషన్‌షిప్‌లో ఉన్నానంటూ ఫేస్ బుక్ లో తేజ్ ప్రతాప్ యాదవ్ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. దాంతో లాలూ ఈ చర్యలు తీసుకున్నారు. శనివారం తేజ్‌ ప్రతాప్‌ ఫేస్‌బుక్‌లో మహిళతో ఉన్న ఫొటో పెట్టారు. ఆమె పేరు అనుష్క యాదవ్‌ అని, 12 ఏళ్లుగా తాము రిలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై రచ్చ జరిగింది. ఆ వెంటనే తేజ్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. తన సోషల్‌ మీడియాను ఎవరో హ్యాక్‌ చేశారని ఆయన తెలిపారు. తన కుటుంబ గౌరవాన్ని దెబ్బతీసేందుకే ఎవరో ఇలాంటి పోస్ట్ చేశారని ఆరోపించారు. ఆ ఫొటో సైతం ఎడిట్ చేసిందన్నారు. కానీ, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తేజ్ ప్రతాప్ యాదవ్ పై వేటు పడింది.

”నా పెద్ద కొడుకు చేస్తున్న పనులు.. మా కుటుంబ విలువలకు అనుగుణంగా లేవు. ప్రస్తుత పరిస్థితుల్లో నేను అతడిని పార్టీ నుండి, కుటుంబం నుండి తొలగిస్తున్నా. ఇక నుండి, అతనికి పార్టీ, కుటుంబంలో ఎటువంటి పాత్ర ఉండదు. అతడిని ఆరేళ్ల పార్టీ నుండి బహిష్కరిస్తున్నా” అని లాలూ తెలిపారు.

సోషల్ మీడియాలో డిలీట్ చేయబడిన పోస్ట్ తేజ్ ప్రతాప్ తొలగింపునకు దారితీసింది. తేజ్ ప్రతాప్ యాదవ్ ఫేస్‌బుక్ ప్రొఫైల్ నుండి ఒక మహిళతో ఉన్న ఫోటో నిన్న షేర్ చేయబడింది. ఆ మహిళను అనుష్క యాదవ్ గా చెప్పారు. తామిద్దరం 12 సంవత్సరాలుగా రిలేషన్ షిప్ లో ఉన్నామని చెప్పారు. ”మేమిద్దరం 12 సంవత్సరాలుగా ఒకరికొకరం తెలుసు. ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటున్నాము. మేము రిలేషన్ షిప్ లో ఉన్నాము. చాలా కాలంగా దీన్ని మీ అందరితో పంచుకోవాలనుకున్నా. కానీ సరైన పదాలు దొరకలేదు. ఈరోజు, ఈ పోస్ట్ ద్వారా, నేను ఓపెన్ అవుతున్నా. మీరందరూ అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను” అని తేజ్ ఒక పోస్ట్ పెట్టారు.

Also Read: ఎన్డీయే పాలిత సీఎంలు, డిప్యూటీ సీఎంల కీలక సమావేశం.. రెండు తీర్మానాలకు ఏకగ్రీవ ఆమోదం..

తేజ్ పెట్టిన ఈ పోస్ట్ పై రచ్చ రచ్చ జరిగింది. తీవ్ర విమర్శలు వచ్చాయి. తేజ్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇది వరకే ఆ మహిళతో రిలేషన్ షిప్ లో ఉంటే.. మరి బీహార్ మాజీ మంత్రి చంద్రికా రాయ్ కుమార్తె ఐశ్వర్యను 2018లో ఎందుకు వివాహం చేసుకున్నారని పలువురు తేజ్ ను నిలదీశారు. కాగా, తేజ్ ప్రతాప్, ఐశ్వర్య వివాహం జరిగిన కొన్ని నెలల తర్వాత విడిపోయారు.

ఫేస్‌బుక్ పోస్ట్ దుమారం రేపడంతో కాపటికే తేజ్ ప్రతాప్ స్పందించారు. వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు. తన అకౌంట్ హ్యాక్ అయిందని చెప్పారు. “నా సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ చేయబడింది. నా ఫొటోలను ఎడిట్ చేశారు. తప్పుగా చూపించారు” అని తేజ్ ప్రతాప్ యాదవ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతేకాదు.. ఆయన అకౌంట్ నుంచి ఆ పోస్ట్ డిలీట్ కూడా అయ్యింది.

ఈ వ్యవహారంపై తేజ్ ప్రతాప్ తమ్ముడు, ఆర్జేడీ కీలక నేత తేజస్వి స్పందించారు. ఇలాంటి వాటిని సహించేది లేదన్నారు. “మేము మా పని చేస్తున్నాము, బీహార్‌కు అంకితభావంతో ఉన్నాము. ప్రజల సమస్యలను లేవనెత్తుతున్నాము. నా అన్నయ్య విషయానికొస్తే, రాజకీయ జీవితం వ్యక్తిగత జీవితం భిన్నంగా ఉంటాయి. ఆయనకు తన వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది. ఆయన పెద్దవాడు. నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంది” అని తేజస్వి అన్నారు.

ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి ఆర్జేడీ సిద్ధమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మయంలో తేజ్ ప్రతాప్ ఫేస్‌బుక్ పోస్ట్, ఆయన వ్యక్తిగత జీవితం గురించి చర్చలు.. ఆర్జేడీని ఇబ్బందుల్లోకి నెట్టాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.