అపార్ట్ మెంట్‌లో ఏ నల్లా విప్పినా లిక్కర్ వస్తోంది

  • Publish Date - February 5, 2020 / 11:01 AM IST

ఓ అపార్ట్ మెంట్ రాత్రికి రాత్రే పబ్‌గా మారిపోయింది. ఏ నల్లా విప్పినా లిక్కర్ వచ్చింది. కిచెన్, హాల్, బాత్ రూం..ఇలా గదుల్లో ఉన్న ఏ నల్లా విప్పినా మందు వస్తుండడంతో అపార్ట్ మెంట్ వాసులు ఆశ్చర్యపోతున్నారు. అసలు ఏం జరిగింది ? నీళ్లు బదులు లిక్కర్ వచ్చుడేంది ? అంటూ ఒకరినొకరు చర్చించుకున్నారు. ఈ విషయం..దావానంలా వ్యాపించేసింది. దీంతో అందరూ ఏ అపార్ట్ మెంట్ అంటూ ఆరా తీయడం మొదలు పెట్టారు. 
అసలు విషయం

కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్ జిల్లా చలాకుడిలో సోలమన్స్ ఎవెన్యూ అనే అపార్ట్ మెంట్ ఉంది. నల్లాలో లిక్కర్ సరఫరా అవుతుండడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అపార్ట్ మెంట్‌లో నివాసం ఉంటున్న 18 కుటుంబాలకు ఈ విచిత్ర అనుభవం ఎదురైంది. అపార్ట్ మెంట్ ఓవర్ హెడ్ ట్యాంకులో ఎవరైనా మందు కలిపారా ? కలిపితే అంత మందును ఎలా కలుపుతారు ? అంటూ ప్రశ్నించుకున్నారు. అపార్ట్ మెంట్‌లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. వారు అనుకుంటున్నట్లు ఏమీ జరగలేదు. అసలు విషయం తెలిసి నోరెళ్ల బెట్టారు. 

అపార్ట్ మెంట్ పక్కనే రచనా బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. బార్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లను ఎక్సైజ్ శాఖ అధికారులు ధ్వంసం చేశారు. ఇది జరిగి ఆరేళ్లు అయ్యింది. కోర్టు ఆదేశాలతో బార్ పరిసరాల్లో ఓ భారీ గొయ్యి తీసి ఆరు వేల లీటర్ల మద్యాన్ని పారబోశారు. 

ఈ మద్యం భూమిలోకి ఇంకి..పక్కనే ఉన్న సోలమన్స్ అపార్ట్ మెంట్‌లో ఉన్న బావిలోకి చేరింది. బావిలో ఉన్న నీటినే ఓవర్ హెడ్ ట్యాంకుకు పంపిస్తారు. అక్కడి నుంచి అపార్ట్ మెంట్‌లోని ప్లాట్‌లోకి సరఫరా చేస్తారు. ఆరేళ్ల క్రితం ఎక్సైజ్ శాఖ పారబోసిన మద్యం కొంచెంకొంచెంగా బయటపడింది. ఇటీవలే నీళ్లలో మద్యం మోతాదు పెరిగింది. ఈ ఘటనపై మున్సిపల్ సెక్రటరీ..ఆరోగ్య శాఖాధికారులకు కంప్లయింట్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అప్పటి ఎక్సైజ్ శాఖ అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి.