Anti-Paper Leak Bill : లోక్‌సభ మంగళవారానికి వాయిదా.. యాంటీ-పేపర్ లీక్ బిల్లుపై మళ్లీ వేడెక్కనున్న చర్చ!
Anti-Paper Leak Bill : లోక్‌సభలో పేపర్ లీక్ నిరోధక బిల్లును కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టారు. కానీ, ఆ బిల్లుపై చర్చ జరగలేదు. మంగళవారం బిల్లు ఆమోదంపై చర్చ జరిపి ఓటింగ్ నిర్వహించే అవకాశం ఉంది.
Anti-Paper Leak Bill
- లోక్‌సభలో మళ్లీ యాంటీ-పేపర్ లీక్ బిల్లు
- విపక్షాల తదుపరి అడుగు ఏంటి?
- మంగళవారం లోక్‌సభలో హై వోల్టేజ్ డిబేట్..
Anti-Paper Leak Bill : పేపర్ లీక్ నిరోధక బిల్లుపై ప్రతిష్టంభనకు తెరపడింది. ఈ చట్ట సవరణ బిల్లుపై చర్చించేందుకు ఎట్టకేలకు ప్రతిపక్ష పార్టీలు అంగీకరించాయి. స్పీకర్ ఓం బిర్లా చొరవతో సభలో పేపర్ లీక్ నిరోధక బిల్లుపై చర్చించేందుకు ప్రధాన రాజకీయ పార్టీల సభా నేతలు సమ్మతిని తెలిపారు. సోమవారం (జూలై 27) చట్ట సవరణ బిల్లుపై చర్చకు స్పీకర్ స్వాగతించినా విపక్షాలు సహకరించలేదు.
దాంతో లోక్‌సభ మంగళవారానికి వాయిదా పడింది. ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టడమే లక్ష్యంగా రూపొందించిన ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) బిల్, 2026’పై జూలై 28వ తేదీ (మంగళవారం) మధ్యాహ్నం 12 గంటలకు మళ్లీ చర్చ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఓటింగ్ నిర్వహించనున్నారు.
సభా కార్యకలాపాల సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. ఈ సమస్య లక్షలాది మంది విద్యార్థులు, యువతకు, పోటీ పరీక్షల పారదర్శకతకు సంబంధించినదని పేర్కొన్నారు. అన్ని పార్టీలను దీనిపై సమగ్రమైన అర్థవంతమైన చర్చ జరపాలని కోరారు.
సాయంత్రం 5 గంటలలోపు చర్చను ప్రారంభించేందుకు అంగీకరించాలని స్పీకర్ అధికార, ప్రతిపక్ష పార్టీలను కోరారు. అనంతరం స్పీకర్ వివిధ రాజకీయ పార్టీల సభా నాయకులతో స్వయంగా మాట్లాడారు. ఫలితంగా, అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ బిల్లుపై చర్చేందుకు అంగీకరించాయి.
ప్రభుత్వ పరీక్షలలో ప్రశ్నపత్రాల లీకేజీలు, మోసాలు, వ్యవస్థీకృత పరీక్షల మాఫియాలు, ఇతర అనుచిత పద్ధతులను సమర్థవంతంగా అరికట్టడమే ఈ బిల్లు లక్ష్యం. మంగళవారం జరిగే చర్చలో, వివిధ పార్టీలు ఈ బిల్లులోని నిబంధనలకు సూచనలు, సవరణలు ప్రతిపాదించవచ్చు. చర్చ అనంతరం ప్రభుత్వం ఈ సూచనలకు స్పందించి ఆమోదం కోసం బిల్లును సభలో ప్రవేశపెట్టనుంది.
మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభ తిరిగి ప్రారంభం కాగా విపక్షాల ఆందోళన నడుమ మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. స్పీకర్ విజ్ఞప్తి చేసినప్పటికీ, ప్రతిపక్ష సభ్యులు సభా ప్రాంగణంలోనే ఉండిపోయారు. స్పీకర్ మొదట సభా కార్యకలాపాలను మధ్యాహ్నం 2 గంటల వరకు, ఆ తర్వాత సాయంత్రం 5 గంటల వరకు వాయిదా వేశారు.
