లోక్ సభలో కోల్ కతా రగడ : మోడీని దుమ్మెత్తిపోసిన విపక్షాలు

ఆదివారం(ఫిబ్రవరి-3,2019) కోల్ కతాలో జరిగిన ఘటనను విపక్షాలు లోక్ సభలో సోమవారం(ఫిబ్రవరి-4,2019) లేవనెత్తాయి. విపక్ష పార్టీల సభ్యుల నినాదాలతో లోక్ సభ దద్దరిల్లింది. సీబీఐని కేంద్రప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, ప్రత్యర్థి పార్టీలపై కక్ష సాధింపు చర్యలకు కేంద్రం సీబీఐని వాడుకుంటోందని సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం.. సీబీఐ, మోడీ, అమిత్ షా నాయకత్వంలోని బీజేపీకి వ్యతిరేకంగా వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ధర్నా చేస్తున్నారని తృణముల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతా రాయ్ అన్నారు. ప్రధాని లోక్ సభలో దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

కోల్ కతా ఘటనపై లోక్ సభలో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ శారదా చిట్ ఫండ్ స్కామ్ లో విచారణ కోసం సుప్రీం ఇచ్చిన ఉత్తర్వుల కారణంగానే సీబీఐ చర్యలకు దిగిందని, కోల్ కతా సీపీకి అనేకసార్లు సమన్లు జారీ చేసినా అతడు రెస్పాండ్ అవలేదని రాజ్ నాథ్ తెలిపారు. వెస్గ్ బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి నోటీసులు జారీ చేశారని, సమస్యను పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని వారిని కోరినట్లు రాజ్ నాథ్ సభకు తెలియజేశారు. అయితే విపక్ష పార్టీల ఆందోళనల మధ్య మధ్యాహ్నాం 2గంటలకు  స్పీకర్ సుమిత్రా మహాజన్  సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.