కేరళలో ఆసక్తికరంగా ట్రయాంగిల్ ఫైట్.. కంచుకోటను నిలబెట్టుకునేందుకు కామ్రేడ్ల స్కెచ్

కేరళలో మెజార్టీ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న కమలనాథులు.. అనుకున్నట్లు సీట్లు దక్కకపోయినా..ఓట్లు అయినా పెంచుకోవచ్చని భావిస్తున్నారు.

Lok Sabha Election 2024: సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా ఓ ఎత్తు అయితే..కేరళలో మాత్రం ఆసక్తికరంగా మారాయి. 20 ఎంపీ సీట్లున్న కేరళలో ఈసారి ఎలాగైనా పట్టు సాధించాలని భావిస్తోంది బీజేపీ. అందుకోసం అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు అన్నింటిలో జాగ్రత్తలు తీసుకుంటూ వస్తోంది కమలదళం. కేరళలో మెజార్టీ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న కమలనాథులు.. అనుకున్నట్లు సీట్లు దక్కకపోయినా..ఓట్లు అయినా పెంచుకోవచ్చని భావిస్తున్నారు. ప్రధాని మోదీ, అమిత్‌షా, బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీనడ్డా వరుస ప్రచారం చేస్తున్నారు. రోడ్ షోలు, సభలు సమావేశాలతో జనాలను అట్రాక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

వయనాడ్‌పై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి
కేరళలోని వయనాడ్‌ నుంచి రాహుల్ గాంధీ బరిలో ఉన్నారు. దాంతో వయనాడ్ సీటుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు కమలనాథులు. వయనాడ్ నుంచి రాహుల్‌గాంధీపై కేరళ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ సురేంద్రన్‌ను బరిలోకి దింపారు. కాంగ్రెస్ పార్టీ కూడా వయనాడ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈసారి రాహుల్ గాంధీ ఒకే ఒక్క లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తుండటంతో.. గ్రౌండ్‌లో పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు ఏఐసీసీ నేతలు.

ఇక కేరళలో కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టుల మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలతో కలసి పోటీ చేస్తున్న కాంగ్రెస్.. కేరళలో మాత్రం సింగిల్‌గానే బరిలో ఉంది. ఒంటరిగా పోటీ చేయడమే కాదు..కమ్యూనిస్టుల నుంచి తీవ్ర విమర్శలు, పోటీని ఎదుర్కొంటోంది కాంగ్రెస్.

కాంగ్రెస్, సీపీఐ మధ్య రాజకీయ వైరం
రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్ సీటు నుంచి LDF అభ్యర్థిగా డి రాజా సతీమణి అన్నీరాజా బరిలో ఉన్నారు. కేరళలోని 20 ఎంపీ సీట్లలో కమ్యూనిస్టులు.. కాంగ్రెస్ నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారు. దాంతో కేరళలో కాంగ్రెస్, సీపీఐల మధ్య రాజకీయ వైరం ముదిరింది. రెండుపక్షాల నేతలు ఒకరినొకరు టార్గెట్ చేసుకున్నారు. కేరళ సీఎం పినరయి విజయన్‌ కాంగ్రెస్‌ నేతలను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. రాహుల్ గాంధీ సీరియస్ పొలిటీషియన్ కాదని విజయన్ అంటే.. కేరళ సీఎం బీజేపీతో చేతులు కలిపారని రాహుల్, ప్రియాంక ఆరోపించారు.

Also Read: ఎన్నికలు జరగకుండానే ఎంపీగా గెలిచిన బీజేపీ అభ్యర్థి

35 వేల మంది ప్రవాస ఓటర్లు
ఇలాంటి టఫ్ సిచ్యువేషన్‌లో కేరళలో ఎంపీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 26న కేరళలోని 20లోక్‌సభ స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరగనుంది. దాంతో ఓటింగ్‌పై దృష్టి పెట్టాయి పార్టీలు. వివిధ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు నేతలు. ఈ క్రమంలో దుబాయ్‌లో ఉన్న ప్రవాస ఓటర్లను కేరళకు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 35 వేల మంది ప్రవాస ఓటర్లు కేరళకు వచ్చినట్లు లెక్కలు చెప్తున్నారు. పోలింగ్ రోజు ఉదయం వరకు మరో 10 వేల మంది రావొచ్చని అంచనా వేస్తున్నారు కేరళ అధికారులు.

Also Read: పార్టీల ఉచిత హామీలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పంచ్ డైలాగులు

ట్రెండింగ్ వార్తలు