బీఎస్పీ అధినేత మాయావతికి బిగ్ షాకిచ్చిన యూపీ ఓటర్లు..

దేశంలోకెల్లా అత్యధికంగా 80 ఎంపీ స్థానాలున్న యూపీలో బీఎస్పీకి కీలక ఓటు బ్యాంకు అయిన దళితుల ఓట్లు 20శాతం ఉన్నాయి.

Lok sabha Election 2024 : దేశంలో అత్యధిక లోక్ సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)కి బిగ్ షాక్ తగిలింది. యూపీ ప్రజలు మాయావతికి షాకిచ్చారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ ఒక్క స్థానాన్ని కూడా గెలవలేక పోయింది. యూపీలో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం, పలు సందర్భంగాల్లో జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించిన మాయావతికి, బీఎస్పీ శ్రేణులకు ఈ ఫలితాలు మింగుడుపడని అంశంగా మారాయి. యూపీలోని మొత్తం 80 స్థానాల్లో బీఎస్పీ పోటీ చేయగా.. ఏ ఒక్కచోట ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించలేదు. 2019లో అఖిలేశ్ యాదవ్ తో కలిసి బీఎస్పీ 38 స్థానాల్లో పోటీచేసింది. అందులో 10 సీట్లు గెలుచుకున్నారు. ఈసారి మాయావతి ఏ కూటమిలో చేరకుండా ఒంటరిగా పోటీచేసి ఘోర ఓటమి పాలయ్యారు.

Also Read : ఎన్నికల ఫలితాల అనంతరం ఢిల్లీకి చంద్రబాబు.. ఎందుకో తెలుసా..

దేశంలోకెల్లా అత్యధికంగా 80 ఎంపీ స్థానాలున్న యూపీలో బీఎస్పీకి కీలక ఓటు బ్యాంకు అయిన దళితుల ఓట్లు 20శాతం ఉన్నాయి. 2014లో యూపీలో బీజేపీ పుంజుకున్న తరువాత మెజార్టీ దళితులు బీజేపీ పక్షాన నిలిచారు. రాష్ట్ర రాజకీయాల్లో మాయావతి ప్రభావం తగ్గించేందుకు బీజేపీ దళిత నాయకురాలైన సీనియర్ మంత్రి బేబీరాణి మౌర్యను ప్రోత్సహించగా.. ఎస్పీ అధినేత అఖిలేశ్ సైతం భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కు పరోక్ష మద్దతుగా నిలిచారు. దీంతో ప్రస్తుత ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులు పార్టీకి బలమైన ఓటు బ్యాంకును కోల్పోయారు. దీంతో 2019లో 19.2శాతం ఓట్లు పొందిన పార్టీ.. ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీకి పోలైన ఓట్లు శాతం భారీగా తగ్గింది.

Also Read : ఏపీ ఫైనల్ రిజల్ట్స్.. కూటమికి, వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే..

మరోవైపు గతంలో పలు అంశాల్లో మాయావతి బీజేపీకి మద్దతుగా నిలిచారు. ఆ కారణంగా ఇండియా కూటమి బీఎస్పీని బీజేపీ ‘బి’ టీం అని ప్రచారం చేయడంలో విజయవంతం అయ్యారు. దీంతో ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో బీఎస్పీకి ఘోర పరాభవం ఎదురైంది.

యూపీలో మొత్తం 80 స్థానాల్లో..
బీజేపీ – 33
ఎస్పీ – 37
కాంగ్రెస్ – 6
ఇతరులు – 4 స్థానాల్లో విజయం సాధించారు.

 

ట్రెండింగ్ వార్తలు