పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు హింసాత్మకం

  • Published By: veegamteam ,Published On : May 12, 2019 / 03:46 PM IST
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు హింసాత్మకం

Updated On : May 12, 2019 / 3:46 PM IST

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. ఆరో విడత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మరోసారి ఘర్షణలు తలెత్తాయి. ఘతాల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి, బీజేపీ అభ్యర్థి భారతి ఘోష్‌పై అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఆమెను తీవ్రంగా దూషించడంతో పాటు వాహనాలపైనా దాడి చేశారు. 

వెస్ట్ మిడ్నాపూర్‌లోని ఓ పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించేందుకు భారతీ ఘోష్‌ ప్రయత్నించారు. టీఎంసీ మహిళా కార్యకర్తలు భారతిని వెనక్కి నెట్టడంతో ఆమె కింద పడిపోయారు. మరికొంతమంది ఇటుకలతో ఆమె కారును ధ్వంసం చేశారు. తోపులాటలో భారతి కాలికి స్వల్ప గాయాలయ్యాయి. ఊహించని ఈ పరిణామాలతో భారతి కంట తడి పెట్టారు. పోలీసులు ఆమెను అక్కడి నుంచి సురక్షితంగా తీసుకెళ్లడంతో పరిస్థితి సద్దుమణిగింది.

మొబైల్‌ ఫోన్‌తో ఓ పోలింగ్‌ బూత్‌లోకి ప్రవేశించి, వీడియోలు తీసేందుకు ప్రయత్నించారంటూ భారతిపై టిఎంసి ఆరోపించింది. దీనిపై ఎన్నికల సంఘం వివరణ కోరింది. భారతీ ఘోష్‌ వాహనం నుంచి శుక్రవారం కోటి 13 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

గతంలో వెస్ట్ మిడ్నాపూర్ జిల్లా ఎస్పీగా పనిచేసిన భారతీ ఘోష్.. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలిగా పేరుంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె బీజేపీలో చేరారు. భారతీ ఘోష్‌పై టిఎంసి అభ్యర్థిగా ప్రముఖ నటుడు దీపక్‌ దేవ్‌ పోటీ చేశారు.

శనివారం రాత్రి వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు ఘర్షణల్లో ఝాగ్రామ్ జిల్లాలో ఓ బీజేపీ కార్యకర్త రామెన్‌ సింగ్ మృతి చెందాడు. మరో ముగ్గురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. తృణమూల్ కార్యకర్తలే ఆయన్ను చంపేశారంటూ బీజేపీ ఆరోపిస్తోంది. టిఎంసి కార్యకర్త మైతీ కూడా హత్యకు గురయ్యాడు. పశ్చిమ బెంగాల్లో ఇప్పటివరకు జరిగిన లోక్‌సభ ఎన్నికల అన్ని దశల పోలింగ్‌లోనూ బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి