LPG Cylinder Price cut
LPG Cylinder Price : హోటళ్లు, రెస్టారెంట్లు వంటి ప్రదేశాల్లో వాడే 19కిలోల వాణిజ్య వంటగ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. ఏప్రిల్ నెల ప్రారంభం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య వంటగ్యాస్ ధరను రూ. 30.50 తగ్గించాయి. కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. అయితే, రాష్ట్రాలను బట్టి ఈ తగ్గింపులో మార్పు ఉంటుంది. మరోవైపు ఇళ్లలో వంటకోసం ఉపయోగించే 14 కిలోల సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు.
Also Read : Gold Rate : మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ రేటు ఎంతంటే?
ప్రతీనెలా 1వ తేదీన గ్యాస్ ధరలను కంపెనీలు సవరిస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లోని ధరలకు అనుగుణంగా మార్పులు చేస్తుంటాయి. గత నెల మార్చి1న వాణిజ్య వంటగ్యాస్ ధరను సిలీండర్ పై రూ. 25 పెంచిన విషయం తెలిసిందే. తాజాగా ఏప్రిల్ నెల ప్రారంభం రోజున రూ. 30.50 తగ్గింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విడతల వారిగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో సిలీండర్ ధర తగ్గింపు నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ప్రభుత్వం గత ఆరు నెలల్లో దాదాపు రెండుసార్లు ఇంట్లో వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధరలను తగ్గించింది. గత మార్చి 9న రూ. 100 తగ్గించగా.. అదే సమయంలో రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రూ. 200 తగ్గింపు రాయితీని ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read : అమెరికా H1B వీసా ధరల పెంపు
ప్రస్తుతం తగ్గిన ధరల ప్రకారం.. ఢిల్లీలో 19కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర గతంలో రూ.1,795 ఉండగా.. ప్రస్తుతం రూ. 1,764.50కి చేరింది. చెన్నైలో రూ. 1,930, ముంబైలో రూ. 1,717.50, కోల్ కతాలో రూ.1,879గా నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్ లో 19కిలోల సిలీండర్ పై రూ. 32.50 తగ్గింది. దీంతో ప్రస్తుత ధర రూ. 1,994.50 కాగా, విశాఖపట్టణంలో రూ. 32 తగ్గి.. రూ. 1,826.50కు చేరింది. తగ్గిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి.