Ludo A Gamble Or A Game Of Skill Bombay High Court Issues Notice To State On Plea
Ludo A Gamble Or A Game Of Skill?: లూడో గేమ్‌కు సంబంధించి బొంబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది, లూడో అదృష్టానికి సంబంధించిన ఆట అని, నైపుణ్యానికి సంబంధించినది కాదు అంటూ పిటీషనర్ పేర్కొన్నారు. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఆడుతున్న లూడో గేమ్‌ను లక్కీ గేమ్‌గా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలుపాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధికారి కేశవ్ ములే ఈ పిటిషన్ దాఖలు చెశారు. లూడో సుప్రీం యాప్‌లో ప్రజలు డబ్బు పెట్టి ఆడుతున్నారని, పెద్ద మొత్తంలో నలుగురు వ్యక్తులు డబ్బులు పెట్టి ఈ ఆట ఆడుతున్నారని, 20 రూపాయల గేమ్‌లో విజేతకు రూ.17, యాప్ నడుపుతున్న వ్యక్తికి రూ.3 లభిస్తుందంటూ పిటీషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. బెట్టింగ్ నిషేధ చట్టంలోని 3, 4, 5 సెక్షన్ల క్రిందకు ఈ గేమ్ వస్తుందని, సదరు గేమ్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటూ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. పిటీషన్‌పై రాష్ట్రప్రభుత్వం స్పందన కోరిన హైకోర్టు.. తదుపరి విచారణ జూన్ 22వ తేదీకి వాయిదా వేసింది.
పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ అభయ్ అహుజా.. దీనిపై అత్యవసర విచారణ ఎలా అవసరమని ప్రశ్నించింది. లూడో పేరిట జూదం నడుస్తుందని పిటిషనర్ చెప్పగా.. ఈ క్రీడ వైపు పెద్ద సంఖ్యలో యువత ఆకర్షితులు అవుతున్నారని చెప్పుకొచ్చారు. అందుకే తక్షణమే జోక్యం చేసుకోవాలని పిటిషనర్ హైకోర్టుకు అప్పీల్ చేశారు. హైకోర్టును ఆశ్రయించే ముందు పిటిషనర్ దిగువ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ట్రయల్ కోర్టు, దీనిని నైపుణ్యం గల ఆట అంటూ, ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ఆదేశించలేదు. దీంతో పిటీషనర్ హైకోర్టును ఆశ్రయించారు.