నామినేషన్ వేసిన పళనిస్వామి,కమల్,స్టాలిన్,దినకరన్,ఉదయనిధి
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం(మార్చి-15,2021) పలువురు ముఖ్య నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. శని, ఆదివారాలు సెలవు కావడంతో నామినేషన్లు స్వీకరించలేదు. ఇక సోమవారం.. అంటే ఈ రోజు ముహూర్తం బాగుండడంతో నేతలందరూ నామినేషన్ల దాఖలకు చేస్తున్నారు.

M K Stalinkamal Haasanudhay Stalintn Cm Files Nomination
tamilnadu తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం(మార్చి-15,2021) పలువురు ముఖ్య నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. శని, ఆదివారాలు సెలవు కావడంతో నామినేషన్లు స్వీకరించలేదు. ఇక సోమవారం.. అంటే ఈ రోజు ముహూర్తం బాగుండడంతో నేతలందరూ నామినేషన్ల దాఖలకు చేస్తున్నారు.
తమిళనాడు సీఎం పళనిస్వామి తన సొంత నియోజకవర్గం ఎడప్పాడి నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. తన ఇంటికి సమీపంలోని స్థానిక తాలూకా కార్యాలయానికి కాలినడకన వెళ్లిన ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఎడప్పాడి నుంచి పళనిస్వామి.. 1989, 1991, 2011, 2016 ఎన్నికల్లో నాలుగు సార్లు విజయం సాధించారు.
డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కూడా ఇవాళే నామినేషన్ వేశారు. చెన్నైకి సమీపంలోని కొలతూర్ నియోజకవర్గం డీఎంకే అభ్యర్థిగా అయనవరం తాలుకా కార్యాలయానికి వెళ్లి స్టాలిన్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన స్టాలిన్‌కు ఘన స్వాగతం లభించింది. నామినేషన్ ఘట్టానికి భారీగా తరలివచ్చారు కార్యకర్తలు. నామపత్రాల సమర్పణ అనంతరం కొలతూర్ లో స్టాలిన్ భారీ రోడ్ షో నిర్వహించారు. రోడ్‌షోలో కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు స్టాలిన్. 2011నుంచి కొలతూర్ స్థానానికి స్టాలిన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇక, డీఎంకే యూత్ వింగ్ సెక్రటరీగా ఉన్న స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్.. చెపాక్-ట్రిప్లికేన్ నియోజకవర్గం డీఎంకే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్న ఉదయనిధి..తన తాత కురుణానిధికి కంటుకోట అయిన చెపాన్ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతుండటం విశేషం
మక్కల్ నీది మయ్యం అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా ఇవాళే నామినేషన్ దాఖలు చేశారు. కోయంబత్తూర్ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. కమల్ సహా అతని నేతృత్వంలోని ఎమ్ఎన్ఎమ్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి. ఇక, అమ్మా మక్కల్ మున్నేత్ర కజగం పార్టీ ప్రధానకార్యదర్శి టీటీవీ దినకరన్ కూడా ఇవాళ తన నామినేషన్ దాఖలు చేశారు. కోవిల్‌పట్టి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దినకరన్ పోటీ చేస్తున్నారు.
234 స్థానాలున్న తమిళనాడులో ఏప్రిల్ 6న ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే-2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.