మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. అధికార కాంగ్రెస్ పార్టీ నేతల రాజీనామాల ఆట మొదలైంది. కాంగ్రెస్ రెబల్ నేత జ్యోతిరాదిత్య సింధియా ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన అనంతరం రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడంతో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బపడింది. బీజేపీ దెబ్బకు మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. రెబల్ నేత జ్యోతిరాదిత్య సింధియా అమిత్ షాతో కలసి ప్రధాని మోడీ ఆయన నివాసం వద్ద కలిశారు.
రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేల ఆచూకీ లేదు. సోమవారం అర్ధరాత్రి నుంచి మొదలైన పొలిటికల్ హైడ్రామా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో సీఎం కమల్ నాథ్ తన నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, న్యాయవాది, రాజ్యసభ ఎంపీ వివేక్ టంఖా, మాజీ విపక్ష నేత అజయ్ సింగ్ సహా 10 కేబినెట్ మంత్రులంతా అర్ధరాత్రివరకు సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. బీజేపీ వేసిన ఎత్తుగడతో కుప్పకూలనున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలా నిలబెట్టుకోవాలో తెలియక సీనియర్ నేతలంతా తర్జనభర్జన పడుతున్నారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 230 స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం.. రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. జౌరా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే భన్వరిలాల్ శర్మ, అగర్-మాల్వావ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యే మనోహార్ ఉత్వాల్ చనిపోవడంతో ఈ రెండు సీట్లు ఖాళీ అయ్యాయి. ఇప్పుడు.. 115 మార్క్ ఉంది. కాంగ్రెస్ కు 114 ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఇద్దరు BSP ఎమ్మెల్యేలు, ఎస్పీ శాసనసభపక్ష నేత, నలుగురు స్వతంత్రుల మద్దతు ఉంది. మరోవైపు బీజేపీకి 107 మంది సభ్యులు ఉన్నారు.
కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు ఇద్దరు ఎంపీలను పంపనుంది. అవసరమైతే విశ్వాస పరీక్ష ద్వారా నెగ్గాలని భావిస్తోంది. కానీ, కాంగ్రెస్‌లో 19మంది ఎమ్మెల్యేలు అదృశ్యమయ్యారు. సింధియా వర్గానికి చెందిన 17 మంది గతవారం నుంచి కనిపించడం లేదు. దీంతో కమల్ నాథ్ ప్రభుత్వంలో సొంతంగా 95మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. అందులో ఏడుగురు కూటమి శాసనసభ్యులు. అధికారిక కూటమి సభ్యులతో కలిపి సభలో 102 మంది సభ్యులు ఉండగా, బీజేపీ 107మంది సభ్యులతో పైచేయిగా ఉంది.
మరోవైపు ఇద్దరు బీజేపీ ఎమ్మెలేలు సీఎం కమల్ నాథ్ తో టచ్ లో ఉన్నారని, వారిని కూడా రిజైన్ చేయాలని ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిన తర్వాత అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 226 మందికి చేరింది. అదే ఇప్పుడు 19 కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలకు అనర్హత వేటు వర్తిస్తే మాత్రం మొత్తంగా అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 207 స్థానాలకు చేరుతుంది.
అప్పుడు సాధారణ మెజార్టీ 104గా ఉంటుంది. బీజేపీ ఎమ్మెల్యేలు ఇద్దరి కంటే ఎక్కువ మంది కాంగ్రెస్‌కు మద్దుతు ఇస్తే.. బీజేపీలో 105 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 102కు చేరుతుంది. ఇదిలా ఉండగా, మార్చి 16 నుంచి మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాజ్యసభ నామినేషన్లకు మార్చి 13 చివరి తేదీ కాగా, మార్చి 26 నుంచి ఓటింగ్ మొదలు కానుంది.
See Also | కేంద్ర కేబినెట్‌లోకి జ్యోతిరాదిత్య సింధియా?!: ఉత్కంఠగా మధ్యప్రదేశ్ రాజకీయం!!