మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిధీ జిల్లాలో ఓ మహిళ తన పూర్వీకుల నుంచి తనకు వచ్చే ఆస్తికి మ్యుటేషన్ కోసం ఎమ్మార్వోకు అదిరిపోయో బహుమతి ఇచ్చింది. మరి ఆ బహుమతి ఏంటో తెలిస్తే పగలబడి నవ్వుకుంటారు. అసలు ఆ బహుమతి ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఎందుకు ఇచ్చిందో తెలుసుకుందాం.
వివరాల్లోకి వెళ్తే.. నౌథియా గ్రామానికి చెందిన రాంకలీ పటేల్ అనే మహిళ మంగళవారం (జనవరి 7,2020)న తన పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని తన పేరు మీద మ్యుటేషన్ చేయాలని కోరుతూ ఎమ్మార్వోకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఎమ్మార్వో కార్యాలయం అధికారులు 10వేల రూపాయలు లంచం కావాలని అడిగారు.
దీంతో ఆ మహిళ వద్ద డబ్బులు లేకపోవడంతో ఇంట్లో ఉన్న గేదెను లంచంగా ఇచ్చేందుకు ఎమ్మార్వో కార్యాలయానికి తీసుకువచ్చింది. అది చూసిన ఎమ్మార్వో అధికారులు ఈ విషయం అందరికీ తెలియడంతో ఆందోళన చెంది.. అసలు నిన్ను లంచం ఎవరు అడిగారు అంటూ ఆ మహిళపై కోపగించుకున్నాడు.
అంతేకాదు మహిళ పేరున మ్యుటేషన్ నవంబరు 4వ తేదీనే చేశామని, తమను అల్లరి చేసేందుకే మహిళ కుట్ర పన్ని కార్యాలయానికి గేదెను తెచ్చిందని ఎమ్మార్వో వివరణ ఇచ్చారు. కాగా, మహిళపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశామని జిల్లా మెజిస్ట్రేట్ ఆర్ కే సిన్హా చెప్పారు. మొత్తం అధికారులకు గేదెను లంచంగా ఇవ్వబోయిన మహిళ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.