×
Ad

తమిళనాడు ఎన్నికల ముందు అగ్గి రాజేస్తోన్న “కార్తీక దీపం” ఇష్యూ.. ఈ వివాదానికి వందేళ్లకు పైగా చరిత్ర  

కొండపై దీపం వెలిగించవచ్చని మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం ఇవాళ స్పెషల్ లీవ్‌ పిటిషన్ (SLP) ద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Karthigai Deepam

Karthigai Deepam 2025: తమిళనాడులోని మదురై తిరుప్పరంకుండ్రం హిల్‌పై ఉన్న అరుల్మిగు సుబ్రమణ్య స్వామి ఆలయం-అక్కడి దర్గా వివాదం మరోసారి రాజుకుంది. దాదాపు వందేళ్లకు పైగా ఉన్న ఈ వివాదం మళ్లీ ఇప్పుడు చర్చనీయాంశమైంది. కొన్ని నెలల్లో తమిళనాడు ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ ఇది తెరపైకి రావడం గమనార్హం.

సుబ్రహ్మణ్య స్వామి కొండ దేవాలయంలో కార్తీక దీపం వెలిగించడం హిందువుల పండుగలో ముఖ్యమైన ఆచారం. వివాదం కారణంగా అక్కడ నిషేధాజ్ఞలు ఉన్నాయి.

అయితే, కార్తీక దీపం వెలిగించుకోవచ్చని తాజాగా మద్రాస్‌ హైకోర్టు మదురై బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ కొండ శిఖరంలో దీపం వెలిగించేందుకు పోలీసులు అనుమతించడం లేదని బీజేపీ, హిందూ సంఘాలు నిరసన చేపట్టాయి.

ఆలయం వద్ద నిషేధాజ్ఞలు ఎత్తివేయాలని మదురై బెంచ్ నుంచి ఆదేశాలు వచ్చిన అనంతరం బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తన మద్దతుదారులతో కలిసి రుప్పరంకున్రంలోకి వెళ్లారు. అక్కడ నిషేధాజ్ఞలు ఎత్తివేయాలని నిరసన ప్రదర్శన చేపట్టారు.

తాజా తీర్పు ఏమని వచ్చింది?
పిటిషనర్‌కి, మరో 10 మంది వ్యక్తులకు సెక్యూరిటీతో గిరిశిఖరంలోని దివరీ (Deepathoon) దగ్గర దీపం వెలిగించడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన అపీల్‌ను కోర్టు తిరస్కరించింది.

దీంతో దీపం వెలిగించే ఆచారంపై మద్రాసు హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం ఇవాళ స్పెషల్ లీవ్‌ పిటిషన్ (SLP) ద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

బ్రిటిష్ కాలంలోనే సమస్యలు షురూ..
ఆ ఆలయం వద్ద బ్రిటిష్ కాలంలోనే సమస్యలు మొదలయ్యాయి. కొండ యాజమాన్య హక్కులు దేవాలయానివని, అయినప్పటికీ కొండశిఖరంలోని దర్గా, నెల్లితొప్పు అనే ప్రాంతం మాత్రం దేవాలయ పరిధిలోకి రావని అప్పట్లో ప్రివి కౌన్సిల్ తీర్పు ఇచ్చింది. బ్రిటిష్ కాలంలో అంతిమ అప్పీల్ విచారణ చేసే న్యాయస్థానాన్ని ప్రివి కౌన్సిల్ అంటారు.

దీపత్తూన్ అనే పురాతన స్తంభం దర్గా నుంచి 15 మీటర్ల దూరంలో ఉంది. 1862 నుంచి దీపాన్ని దర్గా కంటే దిగువన ఉన్న ఉచిపిళయ్యర్ దేవాలయం వద్ద వెలిగిస్తున్నారు. కొండపై స్తంభం (పిల్లర్‌) వద్ద దీపం వెలిగించేందుకు మాత్రం అనుమతి లేదు.

ఈ మొత్తం వివాదం ప్రస్తుతానికి దీపం వెలిగించే ఆచారంపైనే కొనసాగుతున్నప్పటికీ, కొండపైన ఏ భాగంపై ఎవరికి హక్కులు ఉన్నాయి? అన్న ప్రశ్న స్వాతంత్ర్యానికి ముందే మొదలైంది.

మరోవైపు, 2014లో మద్రాస్ హైకోర్టు 2 సభ్యుల బెంచ్ దీపత్తూన్ వద్ద దీపం వెలిగించరాదని తీర్పు ఇచ్చింది.

తాజాగా ఓ వ్యక్తి మదురై బెంచ్‌లో పిటిషన్‌ వేసి కొండపై స్తంభం వద్ద దీపం వెలిగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీంతో కొండశిఖర స్తంభం వద్ద దీపం వెలిగించాలని, దేవాలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.

దేవాలయ అధికారులు సాధారణ స్థలంలోనే దీపం వెలిగించారు. తమిళనాడు ప్రభుత్వం జనసమూహం ఉండకుండా నిషేధాజ్ఞలు విధించడంతో ఇలా చేశారు.

అదే రోజు దాఖలైన మరో పిటిషన్‌పై జస్టిస్ జీఆర్ స్వామినాథన్.. పిటిషనర్‌కు 10 మంది తోడుగా సీఐఎస్‌ఎఫ్‌ భద్రతలో స్తంభం వరకు వెళ్లేందుకు అనుమతించారు. ప్రభుత్వం వేసిన అప్పీల్‌ను బెంచ్ తిరస్కరించింది.

బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ.. “డీఎంకే ప్రభుత్వం కోర్టు ఆదేశాలు పాటించకుండా ఉద్రిక్తత రేగేలా చేస్తోంది. ఇది హిందువుల విశ్వాసానికి వ్యతిరేకం” అని అన్నారు. పోలీసులు ఇప్పటికీ దీపం వెలిగించేందుకు అనుమతించకపోవడంతో న్యాయపరమైన పోరాటం కొనసాగనుంది.

డీఎంకే ఏమంటోంది?
చట్టాన్ని గౌరవిస్తామని, 2014 హైకోర్టు తీర్పు ఆధారంగా చర్యలు తీసుకుంటున్నామని డీఎంకే అంటోంది. వచ్చే సంవత్సరం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఈ అంశాన్ని బీజేపీ వాడుకుంటోందని డీఎంకే ఆరోపణలు చేస్తోంది.

“కార్తిగై (కార్తీక) దీపం తమిళ ప్రజలు మురుగన్ కోసం జరుపుకునే పండుగ. ఇది హిందూ పండుగ కాదు” అని మంత్రి ఎస్ రేగుపతి అన్నారు.

“మేము చట్టాన్ని గౌరవిస్తాం… 2014 తీర్పు ఉన్నప్పుడు దాన్ని రద్దు చేయకుండానే కొత్త సింగిల్ బెంచ్ ఆదేశాలకు అనుగుణంగా ఎలా అనుమతిస్తాం? అలా చేస్తే తమిళనాడు ప్రభుత్వంపైనే ఆరోపణలు వస్తాయి. కాబట్టి మేము 2014 తీర్పు ఆధారంగా వ్యవహరిస్తున్నాం” అని మంత్రి చెప్పారు.

తమిళనాడులో బీజేపీ, సంఘ పరివార్ సంస్థలు మతపర ఉద్రిక్తత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని డీఎంకే ఆరోపణలు చేస్తోంది. మదురైలో అభివృద్ధి కావాలా? లేక రాజకీయాలా? అంటూ సీఎం స్టాలిన్‌ మండిపడ్డారు.

కొండపై సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంది. దీనిని భక్తులు మురుగన్ ఆరు పీఠాలలో ఒకటిగా భావిస్తారు. అలాగే కేవలం కొన్ని మీటర్ల దూరంలో సుల్తాన్ సిక్కందర్ అవులియా దర్గా ఉంది.

వివాదం ఎందుకు మళ్లీ ఎలా రగిలింది?
ఆచారాలు, ఊరేగింపులు, పండుగల సమయంలో భారీ దీపం వెలిగించే ఆచారాలను కొనసాగించడానికి అందుకు తగ్గ పవిత్ర ప్రదేశం(కొండపై స్తంభం ఉన్న చోట)పై పిటిషన్లు రావడంతో వివాదం మళ్లీ ముందుకొచ్చింది.

ఈ ఫిబ్రవరిలో ఊరేగింపులపై వాదనలు జరుగుతున్న సమయంలో కోర్టు స్పందిస్తూ.. ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా సాధ్యమా అని అడిగింది. దీనికి ఇరువర్గాలు తిరస్కరించాయి. సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హసన్ మొహమ్మద్ జిన్నా కొత్త మార్గం ఏదైనా చెబితే రాజకీయ ఉద్రిక్తతలు పెంచుతుందని అన్నారు. గత ఆందోళనల్లో రెచ్చగొట్టే ప్రసంగాలపై కేసులు నమోదయ్యాయని కోర్టు చెప్పింది.