Mahakumbh Mela 2025: రికార్డులు క్రియేట్ చేస్తోన్న మహా కుంభమేళా.. రెండోరోజు ఎంతమంది ‘అమృత స్నాన్’ చేశారంటే..

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా భక్తజనంతో కిక్కిరిసిపోతుంది.

Maha Kumbh Mela 2025

Maha Kumbh Mela 2025: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా భక్తజనంతో కిక్కిరిసిపోతుంది. యూపీలోని ప్రయాగ్ రాజ్ లో సోమవారం ప్రారంభమైన ఈ కుంభమేళా 45రోజుల పాటు సాగనుంది. 40కోట్ల మంది భక్తులు హాజరవుతారని యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. అయితే, తొలిరోజే భక్తులు పోటెత్తారు. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద దాదాపు 1.50 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించారు.

రెండోరోజు మంగళవారం మకర సంక్రాంతి రోజున భక్తులు మొదటి పుణ్యస్నానాలు (అమృత స్నాన్) చేశారు. వివిధ అఖాడాల నుంచి వేలాదిగా వచ్చిన సాధువులు తొలి పుణ్య స్నానాలు ఆచరించారు. తెల్లవారుజామునే 3గంటల సమయంలో బ్రహ్మ ముహూర్తంలో పుణ్యస్నానాలు ప్రారంభమయ్యాయి. దీంతో కుంభమేళాలో మంగళవారం మొత్తం 3.5కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం పేర్కొంది.

మహా కుంభమేళాలో 13 అఖాడాలు పాల్గొన్నాయి. వివిధ అఖాడాల నుంచి నాగ సాధువులు తరలివచ్చి సామూహిక స్నానాలు ఆచరించారు. కేవలం కుంభమేళా సమయంలోనే వారు దర్శనమిస్తారు. ఒంటినిండా భస్మాన్ని పూసుకుని ఈటెలు, త్రిశూలాలు చేతపట్టుకుని ఢమురక నాదాల నడుమ వేల మంది నాగ సాధువులు ఊరేగింపుగా తరలివచ్చి పుణ్యస్నానాలు చేశారు. తొలుత పంచాయతీ అఖాడా మహానిర్వాణీ, శంబు పంచాయతీ అటల్ అఖాడాకు చెందిన సాధువులు పుణ్యస్నానాలు ఆచరించారు.

మహా కుంభమేళాలో పురుష నాగ సాధువులే కాకుండా పెద్ద సంఖ్యలో మహిళా నాగ సన్యాసులు కూడా ఉన్నారు. అమృత్ స్నాన్ సందర్భంగా హెలికాప్టర్ నుంచి భక్తులపై గులాబీ రేకుల వర్షం కురిపించారు. మహానిర్వాణి అఖారాకు చెందిన మహామండలేశ్వర చేతన్ గిరి మహారాజ్ మాట్లాడుతూ.. ప్రయాగ్ రాజ్ లో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభం నిర్వహిస్తామని, అయితే, 12 పూర్ణకుంభాల తరువాత 144 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభం జరుగుతుందని చెప్పారు.

మహా కుంభమేళాలో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ భక్తిపారవశ్యంలో మునిగితేలుతున్నారు. అయితే, 45రోజుల పాటు జరిగే ఈ కుంభమేళాతో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరుతుందని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తుంది. సుమారు రెండు లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని ఆశిస్తున్నారు.

2019లో జరిగిన అర్ధ కుంభమేళాకు 24కోట్ల మంది భక్తులు తరలివచ్చారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1.2లక్షల కోట్లు ఆదాయం సమకూరించింది. ప్రస్తుతం 45రోజులు పాటు సాగే ఈ కుంభమేళాకు 40కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తుంది యూపీ ప్రభుత్వం. తద్వారా యూపీ ప్రభుత్వానికి రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని సీఏఐటీ అంచనా వేస్తోంది.