49 రోజులు, 4వేల కోట్లు : కుంభమేళాకు భారీ ఏర్పాట్లు

  • Publish Date - January 13, 2019 / 07:51 AM IST

లక్నో : ఉత్తరప్రదేశ్ లో కుంభమేళాకు సర్వం సిద్ధమైంది. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 2019, జనవరి 15వ తేదీ నుంచి కుంభమేళా జరుగనుంది. మార్చి 4వ తేదీ వరకు కొనసాగనుంది. 49 రోజులపాటు అర్ధ కుంభమేళా జరుగనుంది. యోగి అదిత్యానాథ్ ప్రభుత్వం దీని కోసం 4 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇది తొలి కుంభమేళా. 

తొలి రోజు నాగ సాధువులు, పీఠాధిపతులు స్నానాలు ఆచరించనున్నారు. 192 దేశాల నుంచి 12 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. తొలి రోజు 30 లక్షల మంది స్నానాలు ఆచరిస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2,800 కోట్లతో దాదాపు 250 కిలోమీటర్ల పొడవైన రోడ్లు, గంగా నది ఒడ్డులను కలుపుతూ 22 వంతెనలు నిర్మించారు.

గంగా నది ఒడ్డు మొత్తాన్ని లైటింగ్స్‌తో అలంకరించారు. భక్తుల దృష్టిని ఆకర్షించేలాగా నగరాన్ని సుందరీకరించారు. ప్రముఖులు, స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలతో పెయింటింగ్ వేశారు. ప్రధాన కూడలిలో పలు విగ్రహాలను ఏర్పాటు చేశారు. సంగమం ప్రాంతానికి భారీగా సాధువులు చేరుకుంటున్నారు. భక్తులతో కుంభమేళా ప్రాంతం కిటకిటలాడుతోంది.