మోడీ-జిన్ పింగ్ పర్యటన తర్వాత…మహాబలిపురానికి క్యూ కడుతున్న టూరిస్టులు

భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ,చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తమిళనాడులోని మహాబలిపురంలో పర్యటించి వెనుదిరిగిన ఒక్క రోజులోనే ఆ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది. మహాబలిపురాన్నిసందర్శించడానికి దేశ వ్యాప్తంగా పర్యాటకులు చాలా ఉత్సహాం చూపిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. చైనా అధ్యక్షుడి పర్యటన సందర్భంగా స్థానిక అధికారులు రోజు వారి కంటే ప్రత్యేకమైన, ఆకర్షణీయ ఏర్పాట్లు చేశారు.
పంచ రథాలు, కృష్ణుడి వెన్నబండ, అర్జున్ పెనాన్స్, లైట్ హౌజ్, ఇలా అత్యంత అరుదైన వాటినన్నింటిని సుందరంగా అలంకరించి తిరిగి వాటిని సందర్శకులకు అందుబాటులోకి తెచ్చారు. అంతేకాకుండా స్వాగత తోరణాలను ఏర్పాటు చేసి వాటిని వివిధ రకాలైన పండ్లతో, పూలతో శోభాయమానంగా అలంకరించారు. అక్కడ వున్న గోడలకు ఆకర్షణీయమైన వివిధ రకాల పేయింటింగ్స్‌ని వేసి మహాబలిపురాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వీటితో పాటు రోడ్డుకిరువైపులా, స్మారక చిహ్నాల వద్ద ఇండియా-చైనా దేశాల పతాకాలతో అలంకరించారు.
మోడీ-జిన్ పింగ్ పర్యటన సందర్భంగా బీచ్ ఒడ్డున ఉన్న ప్రసిద్ధమైన అక్కడి శోర్ దేవాలయాన్ని నిర్వహణా కారణాల రీత్యా పర్యాటకులకు అందుబాటులోకి తేలేదు. అయితే ఆదివారం నుంచి ఈ దేవాలయాన్ని ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి తీసుకురావడంతో వాటిని చూసేందుకు దేశవ్యాప్తంగా పర్యటకులు చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. ఇవాళ ఆదివారం కావడంతో సరదాగా గడిపేందుకు,చారిత్రక కట్టడాలను తికించేందుకు భారీ సంఖ్యలో టూరిస్టులు మహాబలిపురంకు చేరుకుంటున్నారు. ఇంతకు ముందు ఎన్నడూ లేనివిధంగా మహాబలిపురాన్ని తీర్చిదిద్దారని పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రెండు రోజుల భారత పర్యటన కోసం శుక్రవారం(అక్టోబర్-11,2019)ఉదయం చెన్నై చేరుకున్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆ రోజు సాయంత్రమే రోడ్డు మార్గంలో మహాబలిపురానికి చేరుకున్నారు. మహాబలిపురంలో తమిళ వస్త్రధారణలో ప్రధాని మోడీ జిన్ పింగ్ కు స్వాగతం పలికారు. శనివారం తిరిగి చెన్నై చేరుకున్న జిన్ పింగ్ అక్కడి నుంచి నేరుగా నేపాల్ పర్యటనకు వెళ్లారు.