×
Ad

మహాఘట్‌బంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్‌ పేరు ఖరారు.. ఎన్డీఏకి గెహ్లోట్ సవాల్..

“ఎన్డీఏ సీఎం అభ్యర్థి ఎవరు? అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు సమాధానం చెప్పాలి. ఇది మా డిమాండ్" అని గెహ్లోట్ అన్నారు.

Bihar Assembly elections 2025: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ సీఎం అభ్యర్థిగా రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ పేరును మహాఘట్‌బంధన్ గురువారం అధికారికంగా ప్రకటించింది. వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) అధినేత ముకేశ్ సహానీని ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా పేర్కొంది.

పాట్నాలో ఇవాళ నిర్వహించిన మహాఘట్‌బంధన్ మిత్రపక్షాల సంయుక్త మీడియా సమావేశంలో ఈ ప్రకటన చేశారు. దీంతో ప్రతిపక్ష కూటమి నాయకత్వంపై కొన్ని వారాలుగా కొనసాగిన ఊహాగానాలకు ముగింపు లభించింది. (Bihar Assembly elections 2025)

సీనియర్ కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “ఇక్కడ కూర్చున్న అందరం ఈ ఎన్నికల్లో తేజస్వీ యాదవ్‌కు సీఎం అభ్యర్థిగా మద్దతు తెలుపుతున్నాం” అని తెలిపారు. తమ కూటమి సంపూర్ణ ఐక్యతతో పోటీ చేస్తుందని తెలిపారు.

Also Read: అందుకే ఈ నకిలీ మద్యం మాఫియా బయటికి వచ్చింది: వైఎస్ జగన్ సంచలన కామెంట్స్‌

ఎన్‌డీఏ పాలనలో దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలు దెబ్బతింటున్నాయని అశోక్ గెహ్లోట్ అన్నారు. “దేశంలో నెలకొన్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎన్డీఏ నేతలను విమర్శిస్తే జైలుకి పంపిస్తారు. దేశం ఏం కోరుకుంటోంది? ఇప్పుడు బిహార్‌ వైపు చూస్తోంది. పరిస్థితులు తీవ్రతరమయ్యాయి. రైతులు, కార్మికులు, సాధారణ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు” అని అన్నారు.

“ఎన్డీఏ సీఎం అభ్యర్థి ఎవరు? అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు సమాధానం చెప్పాలి. ఇది మా డిమాండ్. ఎందుకంటే గతంలో మహారాష్ట్ర ఎన్నికలు ఏక్‌నాథ్‌ షిండే నాయకత్వంలో జరిగాయని అనుకున్నాం, కానీ తరువాత మరొకరిని ముఖ్యమంత్రిగా చేశారు” అని గెహ్లోట్ అన్నారు.

తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ “ మహాఘట్‌బంధన్‌ లక్ష్యం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాదు, బిహార్‌ను మార్చడం కూడా. అందుకే మనం కలిసున్నాం. నాపై విశ్వాసం ఉంచిన మహాఘట్‌బంధన్ మిత్రులందరికీ ధన్యవాదాలు. మీ అంచనాలకు తగ్గట్టు పనిచేస్తాను. 20 ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని మనం అందరం కలిసి గద్దె దించుతాం” అని అన్నారు.

తన తల్లిదండ్రులు, మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రాబ్రీ దేవి, అలాగే కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తనపై నమ్మకం ఉంచినందుకు తేజస్వీ ధన్యవాదాలు తెలిపారు.