Mahakumbh Stampede: కుంభమేళాలో తొక్కిసలాటకు కారణం ఏమిటి.. ఎందుకలా జరిగింది.. ఎంతమంది గాయపడ్డారు.. సీఎం యోగి ఏం చెప్పారు..

మౌని అమవాస్యను పురస్కరించుకొని పుణ్యస్నానాలు ఆచరించేందుకు మంగళవారం రాత్రి నుంచే భారీ సంఖ్యలో భక్తులు ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం వద్దకు చేరుకున్నారు.

Mahakumbh Stampede

Mahakumbh Stampede: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా. దేశం నలుమూలల నుంచేకాకుండా విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు కుంభమేళా జరిగే ప్రయాగ్ రాజ్ వద్దకు చేరుకొని పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈనెల 13న ఈ కుంభమేళా ప్రారంభం కాగా.. మంగళవారం వరకు 15కోట్ల మందికిపైగా ఈ మేళాలో పాల్గొన్నట్లు అధికారులు అంచనా వేశారు. అయితే, బుధవారం మౌని అమావాస్య కావడంతో త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు చేసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మంగళవారం సాయంత్రం నుంచే ఆ ప్రాంతంలో విపరీతమైన రద్దీ నెలకొంది. అయితే, మౌని అమావాస్య సందర్భంగా సుమారు పదికోట్ల మంది భక్తులు వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముందుగా అంచనా వేసింది. అందుకు తగిన విధంగా ఏర్పాట్లుసైతం చేశారు. కానీ, బుధవారం తెల్లవారు జామున ప్రయాగ రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద అపశృతి చోటు చేసుకుంది. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది.

 

ఎంత మంది గాయపడ్డారు..
మౌని అమవాస్యను పురస్కరించుకొని పుణ్యస్నానాలు ఆచరించేందుకు మంగళవారం రాత్రి నుంచే భారీ సంఖ్యలో భక్తులు ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం వద్దకు చేరుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆ ప్రాంతంలో ఎక్కడికక్కడ అధికారులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. బుధవారం తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం సెక్టార్2 ప్రాంతంలో తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో వంద మందికిపైగా గాయపడినట్లు తెలిసింది. వారిని వెంటనే అధికారులు అంబులెన్సుల సహాయంతో స్థానిక ఆస్పత్రులకు తరలించారు. అయితే, ఈ ఘటనలో 20 మంది మృతిచెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, మృతుల సంఖ్యపై యూపీ ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

 

తొక్కిసలాట ఎక్కడ జరిగింది.. ఎందుకు జరిగింది?
మౌని అమవాస్యను పురస్కరించుకొని ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో సంగం ముక్కు వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఈ ప్రాంతంలో పుణ్యస్నానాలు చేస్తే మంచిదని భక్తులు నమ్ముతారు. ఈ ప్రదేశం ఆకృతి కారణంగా సంగం ముక్కు అని పేరు వచ్చింది. ఈ ప్రాంతంలో యమునా, సరస్వతి నది గంగలో కలుస్తాయని చెబుతారు. చాలా మంది రుషులు, సాధువులు ఈ ప్రదేశంలోనే స్నానం చేస్తారు. భక్తులు కూడా ఈ ప్రాంతంలో పుణ్యస్నానం చేసేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. పెద్ద సంఖ్యలో ప్రజలు సంగం ముక్కుకు చేరుకోవాలని ప్రయత్నించడం వల్లే ఈ తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కుంభమేళాలో ప్రత్యేక కార్యనిర్వహణాధికారి ఆకాంక్ష రాణా చెప్పిన వివరాల ప్రకారం.. సంగం మార్గాల్లో భక్తులు వెళ్లే క్రమంలో బారికేడ్లను తొలగించుకొని వెళ్లే ప్రయత్నంలో ఈ తొక్కిసలాట చోటుచేసుకుందని చెప్పారు. ఈ ప్రమాదంలో కొంతమందికి గాయాలయ్యాయి. వారిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించడం జరిగిందని చెప్పారు.

 

ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారంటే..
ప్రయాగ్ రాజ్ వద్ద తొక్కిసలాట ఘటనలో ప్రత్యక్ష సాక్షి వివేక్ మిశ్రా చెప్పిన వివరాల ప్రకారం.. సంగం ఒడ్డుకు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. అప్పుడు సమయం తెల్లవారు జామున 2.30 గంటలు అయింది. స్నానం చేసిన తరువాత భక్తులు ఎటువైపు వెళ్లాలనే అవగాహన లేకపోవటంతో అక్కడే పెద్దెత్తున ప్రజలు గుమ్మిగూడారు. ఈ క్రమంలో పుణ్యస్నానం చేసేందుకు వచ్చేవారు ముందుకు తోసుకుంటూ రావటంతో బారికేడ్లు విరిగిపోయి ఈ ప్రమాదం జరిగింది. ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఇనుప డస్ట్ బిన్లు ఉన్నాయి. బ్యాలెన్స్ కోల్పోవడంతో చాలా మంది కిందపడ్డారు. వారి లగేజీ ఆ ప్రాంతమంతా కనిపించింది. తన కాలు డస్ట్ బిన్ లో ఇరుక్కుపోయింది. వెంటనే తన తల్లిదండ్రులు, అక్కడే ఉన్న మరో మహిళ నన్ను బయటకు లాగారని విశ్రా వివరించాడు.

 

అఖారాలు పుణ్యస్నానాలు రద్దు చేసుకున్నారా..?
ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద తొక్కిసలాట ఘటన చోటు చేసుకోవటంతో పుణ్యస్నానాలను అఖారాలు రద్దు చేసుకున్నట్లు తెలిసింది. అఖిల భారతీయ అఖారా పరిషత్ అధ్యక్షుడు మహంత్ రవీంద్ర మాట్లాడుతూ.. జరిగిన సంఘటన పట్ల మేము బాధపడుతున్నాము. మాతోపాటు వేలాది మంది భక్తులు ఉన్నారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఈరోజు అఖారాలు స్నానాల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నామని తెలిపారు.

 

ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ ఏమన్నారంటే..
తొక్కిసలాట ఘటన అనంతరం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ మీడియాతో మాట్లాడారు. మౌని అమావాస్య సందర్భంగా భక్తుల తాకిడి పెరిగింది. తెల్లవారు జామున నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నాం. రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎలాంటి వదంతులు ప్రచారం చేయొద్దని ఆధిత్యనాథ్ కోరారు. స్నాన ఘట్టాల వద్ద అన్ని ఏర్పాట్లు చేశాం. కొంతమంది బారికేడ్లను తోసుకుంటూ ముందు వచ్చారు. ఆ సమయంలో తొక్కిసలాట జరిగింది. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించామని అన్నారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారని ఆధిత్యనాథ్ తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని అన్నారు. ఈ క్రమంలో ఆధిత్యనాథ్ భక్తులకు కీలక విజ్ఞప్తి చేశారు. త్రివేణి సంగం వద్దకు కాకుండా అన్ని ఘాట్లలో స్నానం చేయాలని, అనేక ప్రాంతాల్లో స్నానాలు చేసేందుకు స్నాన ఘాట్లు నిర్మించామని, ఎక్కడైనా స్నానం చేయొచ్చునని సూచించారు. ప్రతిఒక్కరూ సహకరించాలని ఎలాంటి పుకార్లను వ్యాప్తిచేయొద్దని యోగి ఆధిత్య నాథ్ కోరారు.