Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు..? నేడు ఢిల్లీలో కీలక సమావేశం.. బీజేపీ సరికొత్త వ్యూహం

మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనే విషయంపై ఇవాళ సాయంత్రం వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది.

maharashtra New CM

maharashtra New CM : మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయతి కూటమి తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుంది. గత శనివారం వెలువడిన ఫలితాల్లో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గాను మహాయతి (ఎన్డీయే) కూటమి 230 స్థానాల్లో విజయం సాధించింది. తద్వారా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. అయితే, ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు అత్యధికంగా 132 స్థానాల్లో విజయం సాధించారు. శివసేన (శిందే) వర్గం 57 స్థానాల్లో, ఎన్సీపీ (అజిత్ పవార్) వర్గం 41 స్థానాల్లో విజయం సాధించింది. ఎన్నికల ముందు వరకు కూటమి ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ శిందే, ఉపముఖ్యమంత్రులుగా అజిత్ పవార్, ఫడణవీస్ లు కొనసాగారు. ఈసారి ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీకి చెందిన నేత అదిష్టించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో ప్రముఖంగా ఫడణవీస్ పేరు వినిపిస్తోంది. అయితే, శివసేన కార్యకర్తలు మాత్రం ఏక్ నాథ్ శిందేను మరోసారి ముఖ్యమంత్రిగా చేయాలని పట్టుబడుతున్నారు. దీంతో తదుపరి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపడతారన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

Also Read: మోదీ సూపర్ సక్సెస్, రాహుల్ అట్టర్ ఫ్లాప్..! మహారాష్ట్రలో బీజేపీ ఘన విజయానికి కారణం అదేనా?

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై ఇవాళ సాయంత్రం వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీలో సాయంత్రం కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంకు సీఎం ఏక్ నాథ్ శిందే, డిప్యూటీ సీఎంలు ఫడణవీస్, అజిత్ పవార్ లు హాజరు కానున్నారు. బీజేపీ అగ్రనేతలతో చర్చల తరువాత సీఎం ఎవరనేదానిపై స్పష్టం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే శివసేన శాసనసభాపక్ష నేతగా ఏక్ నాథ్ శిందే ఎన్నికయ్యారు. బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించడంతో బీజేపీ నేతకే సీఎం పీఠం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో ఫడణవీస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఒకవేళ బీజేపీకే ముఖ్యమంత్రి పీఠం వరిస్తే.. ఫడణవీస్ కే అవకాశం దక్కుతుందా..? మరో వ్యక్తిపేరు తెరపైకి వస్తుందా అనే విషయంపైనా బీజేపీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Also Read : Harish Rao: అందుకే మహారాష్ట్రలో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయింది: హరీశ్ రావు

మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు ఏక్ నాథ్ శిందే సిద్ధంగా ఉన్నారు. ఆయన వర్గీయులుసైతం శిందేకే అవకాశం దక్కుతుందని ఆశతో ఉన్నారు. అయితే, బీజేపీ అగ్రనాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ శిందే ముఖ్యమంత్రి రేసు నుంచి వెనక్కితగ్గి బీజేపీ నేతకే సీఎం పదవి అప్పగిస్తే.. ఉప ముఖ్యమంత్రులుగా ఏక్ నాధ్ శిందే, అజిత్ పవార్ లు ఉండే అవకాశం ఉంది. మరోవైపు మహారాష్ట్ర శాసన సభ గడువు మంగళవారంతో ముగియనుంది. గెలిచిన కూటమి 72గంటల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. లేదంటే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పాటుకు మహాయతి వేగంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం లేదా రేపు మధ్యాహ్నం వరకు మహారాష్ట్ర సీఎం ఎవరనే విషయంపై కూటమి నేతల నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి.