Maharashtra Cm Uddhav Thackeray To Address People Of State Today Night
మహారాష్ట్రలో కరోనా కేసులు రోజు రోజుకూ విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇవాళ(ఏప్రిల్-2,2021) రాత్రి 8:30 గంటలకు ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. సీఎం ప్రసంగిస్తారనే విషయాన్ని ముంబై మేయర్ కిశోరి పెడ్నేకర్ వెల్లడించారు. ప్రజల నిర్లక్ష్యం వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయని..ఈ పరిస్థితి ఆందోళనకరమని.. ఆస్పత్రుల్లో పడకల కొరత, వెంటిలేటర్ల కొరత మళ్లీ ఏర్పడే ప్రమాదం ఉందని పెడ్నేకర్ హెచ్చరించారు.
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఇవాళ రాత్రి ప్రసంగంలో సీఎం ఉద్దవ్ ఠాక్రే మళ్లీ లాక్డౌన్ ప్రకటన చేస్తారా అనే చర్చ జోరుగా సాగుతోంది. ఆర్థిక ప్రభావం లేకుండా లాకౌడౌన్ విధించే సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని అధికారులను ఠాక్రే ఇప్పటికే ఆదేశించడం దీనికి బలం చేకూర్చుతోంది.
ఇక, కరోనా కేసులు పెరుగుతున్నందున పుణెలో శనివారం నుంచి సాయంత్రం 6గంటల నుంచి ఉదయం 6గంటల వరకు(12గంటల పాటు)వారం రోజుల పాటు నైట్ కర్ఫ్యూని విధిస్తున్నామని పూణే డివిజినల్ కమిషనర్ సౌరభ్ రావ్ తెలిపారు. వారం రోజులు బార్లు, హోటళ్లు, రెస్టారెంట్లను మూసివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. హోం డెలివరీ మాత్రం కొనసాగించవచ్చన్నారు. అంత్యక్రియలు, వివాహ వేడుకలు మినహా మరే ఇతర ఫంక్షన్లకు అనుమతి లేదని చెప్పారు.