Ganja
Ganja : ఏ పంట పండించినా నష్టాలే మిగులుతున్నాయి. పెట్టిన డబ్బు తిరిగి రావడం లేదు. దీంతో తీవ్ర ఆవేదన చెందిన ఓ రైతు.. కలెక్టర్ కు రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గంజాయి పండిస్తాను, నాకు అనుమతి ఇవ్వండి అంటూ ఏకంగా కలెక్టర్ కే లేఖ రాసి సంచలనం రేపాడో రైతు.
ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. ఆ రైతు పేరు అనిల్ పాటిల్. సోలాపూర్‌లోని మోహోల్ తెహసిల్ లో ఉంటాడు. రైతు అనిల్ పాటిల్ కలెక్టర్ కు లేఖ రాశాడు.
‘ఏ పంట పండించినా పంటకు మార్కెట్ లో ధర ఉండటం లేదు. పెట్టుబడి కూడా రావడం లేదు. ఏ పంటకూ స్థిరమైన ధర లేదు. కానీ, మార్కెట్‌లో గంజాయికి మాత్రం మంచి డిమాండ్ ఉంది. అందుకే నాకున్న రెండు ఎకరాల భూమిలో గంజాయి సాగు చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతున్నా’ అంటూ లేఖలో రాశాడు.
అంతేకాదు చివరలో ఊహించని ట్విస్ట్ కూడా ఇచ్చాడు. సెప్టెంబర్ 15లోపు తనకు రిప్లయ్ ఇవ్వాలని డెడ్‌లైన్ కూడా పెట్టాడు. లేదంటే తనకు అనుమతి వచ్చినట్టుగానే భావించి 16వ తేదీ నుంచి గంజాయి సాగు మొదలు పెడతానని చెప్పాడు. ఆ తర్వాత గంజాయి పెంచుతున్నాడని తనపై ఎవరైనా నేరం మోపితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని తేల్చి చెప్పాడు.
రైతు రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖను కలెక్టర్ మోహోల్ పోలీసు స్టేషన్‌కు పంపారు. ఈ లేఖపై మోహోల్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ అశోక్ స్పందించారు. రైతు లేఖ ఒక పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపారేశారు. అంతేకాదు, ఒకవేళ గంజాయి సాగు చేస్తే అతడిపై కేసు నమోదు చేస్తామన్నారు.