మహారాష్ట్ర రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠభరితంగా ఉన్నాయి. శివసేన ముఖ్యనాయకులు సంజయ్ రౌత్,రామ్ దాస్ కడమ్ ఇవాళ(నవంబర్-4,2019)సాయంత్రం మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీతో సమావేశమయ్యారు. ఎన్సీపీ-కాంగ్రెస్ లతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటుచేయబోతుందని,అందులో భాగంగానే సంజయ్ రౌత్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ ను కలిసినట్లు ముంబైలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
తాను కేవలం మర్యాదపూర్వకంగానే గవర్నర్ ని కలిశానని భేటీ అనంతరం సంజయ్ రౌత్ తెలిపారు. అయితే తాము మాత్రం అన్నీ నిదానంగా గమనిస్తున్నామని బీజేపీ తెలిపింది. శివసేనతో చర్చలకు తమ డోర్లు ఓపెన్ చేసి ఉన్నట్లు తెలిపింది. అయితే సీఎం సీటు విషయంలో రాజీపడే ప్రశక్తే లేదని ఇవాళ మరోసారి బీజేపీ క్లారిటీ ఇచ్చింది. అయితే ముఖ్యమైన మంత్రిత్వశాఖలను ఇచ్చేందుకు తాము సిద్దమేనని తెలిపింది. గత నెల 24న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-శివసేన కూటమికి పూర్తి మెజార్టీ వచ్చినప్పటికీ ఇప్పటివరకు కొత్త ప్రభుత్వం కొలువుదీరలేదు. చెరో రెండున్నసంవత్సరాల పాటు సీఎం సీటుని పంచుకోవాలంటూ 50:50 ఫార్ములాకు శివసేన పట్టుబడుతోంది. అయితే బీజేపీ అందుకు ఒప్పుకోవడం లేదు. బీజేపీ తమ డిమాండ్ లకు ఒప్పుకోకుంటే ఎన్సీపీ తమకు మద్దతిచ్చేందుకు రెడీగా ఉందంటూ శివసేన బీజేపీని పరోక్షంగా హెచ్చరిస్తోంది.
ఈ సమయంలో ఇవాళ ఢిల్లీలో బీజేపీ నాయకుడు,మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ చీఫ్,కేంద్రహోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. అమిత్ షాతో భేటీ అనంతరం ఫడ్నవీస్ మాట్లాడుతూ…మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఎవరైనా చెప్పే దేనిపైనా తాను కామెంట్ చేయదల్చుకోలేదని,అయితే త్వరలోనే కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందని మాత్రం చెప్పదల్చుకున్నానని,తాను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నానని ఫడ్నవీస్ తెలిపారు. బీజేపీ మహారాష్ట్ర ఇన్ చార్జ్ భూపేంద్రయాదవ్ తో కూడా ఫడ్నవీస్ ఢిల్లీలో కలిశారు.
మరోవైపు ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ ఇవాళ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమవుతున్నారు. మహారాష్ట్రలో ప్రస్తుత పరిస్థితిని సోనియాకు పవార్ వివరించనున్నారు. శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు విషయం కూడా ఈ సమావేశంలో చర్చకు రానుంది. ప్రస్తుత మహారాష్ట్ర ప్రభుత్వ కాలం నవంబర్-8,2019తో ముగుస్తుంది. అప్పటిలోగా కొత్త ప్రభుత్వం కొలువుదీరకుంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశముందని బీజేపీ నాయకులు చెబుతున్నారు.
BJP Sources: We are waiting and watching. Our doors are open to discussions with Shiv Sena. There will be no compromise on CM post. We are open to distribution of ministerial portfolios. #Maharashtra pic.twitter.com/rEthOcyD4O
— ANI (@ANI) 4 November 2019