మకరజ్యోతి దర్శనం : శరణు ఘోషతో మార్మోగిన శబరిగిరులు

  • Publish Date - January 15, 2020 / 01:15 PM IST

కేరళలోని ప్రసిధ్ధ శబరిమల కొండపై నేడు అపరూప ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. మకర సంక్రాంతి పర్వదినాన జనవరి 15న రాత్రి సుమారు 6 గంటల 51 నిమిషాల సమయంలో అయ్యప్ప భక్తులకు మకరజ్యోతి దర్శనం జరిగింది. ప్రతీ ఏడాది సంక్రాంతి రోజు జరగనున్న ఈ దివ్య దర్శనం కోసం లక్షల సంఖ్యలో అయ్యప్ప భక్తులు శబరిమల చేరుకుంటారు.  

రవి ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే శుభవేళ, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కాగా, అదే రోజు సాయంత్రం శబరిమల గిరులకు సమీపంలోని పొన్నాంబళ మేడుపై మకరజ్యోతి దర్శనం ఇస్తుంది. ఆ ప్రాంతం భక్తులతో కిటకిటలాడిపోయింది. స్వామి కోసం పందళ రాజ వంశీకులు తీసుకుని వచ్చే ప్రత్యేక ఆభరణాలను సాయంత్రం ఆరున్నర గంటల తరువాత స్వామికి అలంకరించారు.

మరోవైపు శబరిమల కొండ లక్షలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయింది. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన దాదాపు 5 లక్షల మందికి పైగా భక్తులు పంబ నుంచి సన్నిధానం వరకూ ఉన్నారు. మకరజ్యోతి దర్శనం నిమిత్తం టీబీడీ బోర్డు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లోనూ వేలాదిగా భక్తులు నిలబడి జ్యోతి దర్శనం చేసుకున్నారు. భక్తుల శరణు ఘోషతో శబరిగిరులు మార్మోగిపోయాయి. 

మకరజ్యోతి దర్శనం(మకరు విలక్కు) తర్వాత మరో ఐదు రోజుల పాటు ఆలయం తెరిచే ఉంటుందని, స్వామి దర్శనాలు కొనసాగుతాయని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. స్వామి దర్శనాలు 20వ తేదీ వరకూ కొనసాగుతాయి. జనవరి 21న ఆలయాన్ని మూసివేస్తామని వెల్లడించారు. 

మకరజ్యోతి దర్శనం కోసం వచ్చే భక్తులకోసం ఆలయ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పంబానదితో పాటు సన్నిధానం, హిల్‌టాప్, టోల్‌ప్లాజా సమీపంలోనూ అదనపు బలగాలను మోహరింపజేశారు. ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు తీర్పు తర్వాత శబరిమలలో అప్పుడప్పుడూ ఉద్రిక్తత నెలకోంటూ ఉండటం, మకర జ్యోతికి లక్షల సంఖ్యలో భక్తులు పోటెత్తడంతో భద్రత కట్టుదిట్టం చేశారు.

భక్తుల రద్దీ నియంత్రణ కోసం దాదాపు 1500 మంది పోలీసులు పనిచేస్తున్నారని, వారిలో 15 మంది డీఎస్పీలు, 36 మంది సీఐలు ఉన్నారని, 70 మంది సభ్యుల బాంబ్ స్క్వాడ్ తోపాటు ఎన్ డీఆర్ఎఫ్, ఆర్ఆర్ఎఫ్ టీమ్ లూ రెడీగా ఉన్నాయని ఆలయ నిర్వాహకులైన ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది.