బాంబు దాడిలో గాయపడ్డ​ మంత్రికి మమత పరామర్శ

mamata banerjee బాంబు దాడిలో గాయపడ్డ బెంగాల్​ మంత్రి జాకిర్​ హుస్సేన్​ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరామర్శించారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాంబు దాడిలో గాయపడ్డ మంత్రి జాకిర్​ హుస్సేన్​ ఆరోగ్య నిలకడగా ఉందని.. చెయ్యి, కాలుకు గాయాలయ్యాయని డాక్టర్లు తెలిపారు.

కాగా, జంగీపూర్ నియోజవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జాకీర్ హుస్సేన్ బుధవారం రాత్రి 10 గంటల సమయంలో నిమ్తితా రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. అక్కడి నుంచి కోల్‌కతా వెళ్లేందుకు.. ప్లాట్ ఫారమ్ నెంబర్-2పై రైలు కోసం ఎదురు చూస్తున్నారు. మంత్రితో పాటు ఆయన అనుచరులు కూడా ఉన్నారు. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు స్టేషన్‌లోకి దూసుకొచ్చి నాటు విసిరి పారిపోయారు.

మంత్రి జాకీర్ ముష్సేన్ తీవ్రంగా గాయపడడంతో మొదట జంగీపూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ముర్షీదాబాద్ మెడికల్ కాలేజీలో అడ్మిట్ చేశారు. ప్రాథమిక చికిత్స అనంతరం కోల్‌కతాకు తరలించారు. ఈ ఘటనలో మంత్రితో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయలు అయ్యాయి.

జాకీర్​ హుస్సేన్​పై బాంబు దాడి ఘటనకు సంబంధించిన కేసుపై సీఐడీ విచారణ చేపట్టనుంది. నిందితులను పట్టుకునేందుకు తగిన చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించింది.

పక్కా ప్లాన్ ప్రకారమే జాకీర్ హుస్సేన్ పై దాడి జరిగిందని మమత పేర్కొన్నారు. ఆయనపై బాంబు దాడి జరిగిన సమయంలో అక్కడ తగినంత వెలుతురు కూడా లేదని,పోలీసులు కూడా లేరని మమత ఆరోపించారు. కొందరు వ్యక్తులు తమ పార్టీలో చేరాలని జకీర్‌పై ఒత్తిడి తెచ్చారన్నారు. ఆయనను హత్య చేయాలని కుట్ర పన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ స్థలంలో ఈ సంఘటన జరిగిందన్నారు. వాస్తవాలు బయటపడాలని తాము కోరుకుంటున్నామన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడినవారికి ఒక్కొక్కరికి రూ.5 లక్షలు చొప్పున, సాధారణంగా గాయపడినవారికి ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.