Mamata Banerjee : భవానీపుర్‌ ఉపఎన్నికల బరిలో మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలోని భవానీపుర్‌ ఉపఎన్నికల బరిలోకి దిగనున్నారు. తమ పార్టీ అభ్యర్థిగా మమతా బెనర్జీ పోటీ చేస్తారని టీఎంసీ అధికారికంగా ప్రకటించింది.

Bhawanipur by-election : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలోని భవానీపుర్‌ ఉపఎన్నికల బరిలోకి దిగనున్నారు. భవానీపుర్‌ ఉపఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తారని ఆదివారం టీఎంసీ అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 30న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు శనివారం ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ అప్పుడే అక్కడ ప్రచారాన్ని ప్రారంభించింది.

భవానీపుర్‌ మమత బెనర్జీకి కంచుకోటలాంటిది. రెండుసార్లు ఆమె అక్కడి నుంచే గెలుపొందారు. గత ఎన్నికల్లో నందిగ్రాం నుంచి పోటీ చేసిన మమతా.. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. అయినా తృణమూల్‌ కాంగ్రెస్ కు మెజార్టీ సీట్లు రావడంతో మమతా ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆరు నెలల్లోగా అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉండడంతో ఆమె పోటీ చేయడానికి వీలుగా భవానీపుర్‌ నుంచి గెలుపొందిన సోవన్‌దేవ్‌ ఛటోపాధ్యాయ రాజీనామా చేశారు.

రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా ఉండేందుకు త్వరగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేసిన వినతిని ఈసీ ఆమోదించింది. మమతా నవంబరు 5వ తేదీలోపు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాల్సివుంది. దీంతో పాటుగా శంషేర్‌ గంజ్‌, జాంగీపుర్‌ సీట్లకు కూడా ఎన్నికలు జరుగనున్నాయి.

ట్రెండింగ్ వార్తలు