గీత దాటితే చూస్తూ ఊరుకోను

  • Publish Date - December 15, 2019 / 02:25 AM IST

పౌరసత్వ సవరణ చట్టంను వ్యతిరేకించి పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఆందోళనకారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విధ్వంసాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ బిల్లుపై ప్రజలు తమ నిరసనను శాంతి, ప్రజాస్వామ్యయుతంగా తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే మాత్రం ఉపేక్షించేది లేదని అన్నారు. రహదారులు, రైల్వే లైన్‌లపై సామాన్య ప్రజలకు ఆటంకం సృష్టించొద్దని నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు. నిరసన పేరుతో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయొద్దని హెచ్చరించారు. 

దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం అమలు చేస్తామని కేంద్రం చెబుతుండగా.. జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సీ)ని దీదీ  తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ చట్టాలు తమ రాష్ట్రంలో అమలుకానీయమని అంటున్నారు. అయితే పార్లమెంట్‌ ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పశ్చిమబెంగాల్‌లో అనేక చోట్ల ఆందోళనకారులు విధ్వంసం సృష్టిస్తున్నారు.