బెయిల్ ఆర్డర్‌లో మధ్య పేరు మిస్సవ్వడంతో 8 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి

Man jailed for 8 months for missing his middle name : బెయిల్ ఆర్డర్‌లో మధ్య పేరు మిస్సింగ్ వల్ల ఓ వ్యక్తి 8 నెలలు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ప్రయాగరాజ్‌కు చెందిన వినోద్ కుమార్ బారువార్ ఒక కేసు నిమిత్తం రిమాండ్‌లో ఉన్నాడు. 2019 సెప్టెంబర్ 4న అతడి బెయిల్ పిటిషన్‌ను స్థానిక కోర్టు రద్దు చేయడంతో అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు.
ఈ ఏడాది ఏప్రిల్ 9న వినోద్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే క్లరికల్ తప్పిదం వల్ల బెయిల్ ఆర్డర్‌లో వినోద్ కుమార్ బారువార్ బదులు వినోద్ బారువార్ అని ఉన్నది. రిమాండ్ షీట్‌లో ఉన్న పేరుకు, బెయిల్ ఆర్డర్‌లోని పేరుకు మధ్య తేడా ఉండటంతో అతడిని విడుదల చేసేందుకు జైలు అధికారి నిరాకరించారు.
దీంతో బెయిల్ ఆర్డర్‌లో పేర్కొన్న పేరులో తప్పిదాన్ని సరి చేయాలంటూ వినోద్ కోర్టును అభ్యర్థించాడు. అతడి దరఖాస్తును పరిశీలించిన సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ జేజే మునీర్, జైలు అధికారి తీరును తప్పుపట్టారు. జైలు సూపరింటెండెంట్ రాకేశ్ సింగ్‌ను కోర్టుకు పిలిపించి చీవాట్లు పెట్టారు. చిన్న పొరపాటు వల్ల బెయిల్ పొందిన వ్యక్తిని 8 నెలలపాటు జైల్లో ఉంచడంపై మండిపడ్డారు.
ఎటువంటి న్యాయమైన లేదా సహేతుకమైన కారణం లేకుండా ఒక పౌరుడి స్వేచ్ఛను హరించడం తగదని హితవు పలికారు. శాఖాపరమైన దర్యాప్తుకు ఎందుకు ఆదేశించకూడదో తెలపాలని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాల పట్ల భవిష్యత్తులో జాగ్రత్త వహించాలని రాకేశ్ సింగ్‌ను హెచ్చరించారు. చివరకు డిసెంబర్ 8న వినోద్ కుమార్ బారువార్‌ను బెయిల్‌పై విడుదల చేశారు.