బ్రేకింగ్ : ఢిల్లీలో మరోసారి కాల్పులు కలకలం

  • Publish Date - February 1, 2020 / 12:50 PM IST

ఢిల్లీలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. పౌరసత్వ  సవరణ చట్టానికి వ్యతిరేకంగా షహీన్ బాగ్ వద్ద  నిర్వహిస్తున్న ఆందోళన వద్ద  ఒక  యువకుడు  కాల్పులు జరిపాడు. CAA కి మద్దతుగా గుజ్జార్ అనే వ్యక్తి రెండు సార్లు  గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ దేశంలో హిందువుల మాటే చెల్లుబాటు కావాలని గుజ్జార్ నినాదాలు చేశాడు.

జామియా యూనివర్సిటీ వద్ద కాల్పుల ఘటన మరువక ముందే  మరోసారి కాల్పులు జరపటంతో  ఆందోళన కారులు భయాందోళనలకు గురవుతున్నారు. ఢిల్లీ పోలీసులే  కాల్పులు  జరిపిస్తున్నారని ఆందోళనకారులు ఆరోపించారు. 

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు షాహీన్ బాగ్ ప్రాంతంలో నిరసన ప్రదర్శన కొందరు నిర్వహిస్తున్నారు. ఆసమయంలో కపిల్ గుజ్జర్ 2 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. అప్రమత్తమైన పోలీసులు గుజ్జార్ ను అదుపులోకి తీసుకున్నారు. కపిల్ గుజ్జార్ ను పోలీసులు అరెస్టు చేసినప్పుడు  జై శ్రీరాం అంటూ నినాదాలు చేశాడు.

ఉత్తర ప్రదేశ్ కు చెందిన గుజ్జార్ ప్రస్తుతం ఈస్ట్ ఢిల్లీలో నివాసం ఉంటున్నాడు.  గత 20 రోజులుగా షాహీన్ బాగ్ లో ప్రతి రోజు నిరసన ప్రదర్శనలు జరుగుతూనే ఉన్నాయి.    కాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి రోజు ఈ కాల్పుల ఘటన జరగటం కొంత కలవరం సృష్టించింది.  కాల్పుల ఘటనల వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.