పెళ్లి కోసం సైకిల్ మీద 850 కిలోమీటర్ల ప్రయాణం.. చివరికి క్వారంటైన్ సెంటర్లో

లాక్‌డౌన్ అని తెలియగానే పెళ్లెక్కడ ఆగిపోతుందోనని భయంతో సైకిల్ ఎక్కి వందల కిలోమీటర్ల ప్రయాణం చేశాడు. చివరికి జిల్లా దాటుతుండగా అధికారులు చూసి క్వారంటైన్ సెంటర్లో అప్పజెప్పారు. నేపాల్ సరిహద్దుకు దగ్గర్లోని ఉత్తరప్రదేశ్ జిల్లా వాసి అయిన సోనూ కుమార్ చౌహాన్ పంజాబ్ లోని లూధియానా నుంచి బయల్దేరాడు. 

ట్రాన్స్‌పోర్ట్ లేకపోయినప్పటికీ పెళ్లికి స్నేహితులను తీసుకెళ్లాలని అనుకున్నాడు. నలుగురు కలిసి సైకిళ్లపై బయల్దేరారు. వారం రోజుల పాటు రాత్రింబవళ్లు ప్రయాణించి 850కిలోమీటర్ల దూరం దాటారు. మహరాజ్‌గంజ్ జిల్లాలోని పిప్రా రసూల్ పూర్ గ్రామానికి చేరుకోగానే పోలీసులు ఆపేశారు. 

చౌహాన్ లూధియానాలో టైల్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అతని ముగ్గురు స్నేహితులు కలిసి లాక్ డౌన్ సమయంలో ట్రాన్స్ పోర్ట్ లేకపోవడంతో సైకిళ్లపై పెళ్లికి వెళ్లాలనుకున్నారు. ఆదివారం వరకూ బాగానే ప్రయాణించిన వాళ్లను అధికారులు ఆపేశారు. 

‘నేను ఇంకో 150కిలోమీటర్లు ప్రయాణించి ఉంటే నాకు పెళ్లి జరిగే అవకాశాలు కచ్చితంగా ఉండేవి. ఎటువంటి బంధువర్గాలు రాకుండానే పెళ్లి చేసుకునేవాడిని. కానీ, అధికారులు జిల్లాలోకి ప్రవేశిస్తుండగానే అడ్డుకున్నారు. అయినా ఆరోగ్యం ముఖ్యం కదా. పెళ్లి తర్వాతైనా చేసుకోవచ్చని’ సోనూ కుమార్ అంటున్నాడు. 

జిల్లాలోకి ప్రవేశిస్తుండగానే చౌహాన్ అతని స్నేహితులను ఆపేశాం. వారు ప్రస్తుతం బలరాంపూర్ క్వారంటైన్ సెంటర్లో ఉన్నారు. 14రోజుల పాటు ఉంచి ఆ తర్వాత కూడా కరోనా పరీక్షల్లో నెగెటివ్ వస్తే పంపించేస్తాం అని ఎస్పీ దేవరంజన్ వర్మ అన్నారు.