Man Saves Monkey : ప్రాణాపాయ స్థితిలో కోతి పిల్ల..నోటితో శ్వాస అందించి కాపాడిన డ్రైవర్

కుక్కుల గుంపు దాడిలో తీవ్రంగా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న 8 నెలల కోతిపిల్లని నిమిషానికి పైగా సీపీఆర్(Cardiopulmonary Resuscitation)చేసి రక్షించాడు తమిళనాడుకు చెందిన ఓ అంబులెన్స్

Monkey

Man Saves Monkey : కుక్కుల గుంపు దాడిలో తీవ్రంగా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న 8 నెలల కోతిపిల్లని నిమిషానికి పైగా సీపీఆర్(Cardiopulmonary Resuscitation)చేసి రక్షించాడు తమిళనాడుకు చెందిన ఓ అంబులెన్స్ డ్రైవర్. శ్వాసతీసుకోలేని స్థితిలోఅపస్మారక స్థితిలో పడి ఉన్న ఆ వానరానికి తన నోటితో శ్వాస అందించి దాని ప్రాణాన్ని నిలిపాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఈ భూమిపై ప్రతి చిన్న ప్రాణికి విలువచ్చే వ్యక్తులు ఇప్పటికీ ఉన్నారనడానికి ఈ ఘటనే ఉదాహరణ అంటూ ఆ అంబులెన్స్ డ్రైవర్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

పెరంబలూర్​ జిల్లాలోని సామంతువపురంలో నివసించే ప్రభు(38)ఓ అంబులెన్స్ డ్రైవర్. డిసెంబరు 9న ప్రభు ఇంటి ప్రాంగణంలో ఓ కోతిని వీధికుక్కలు వెంబడించాయి. ఈ ఘటనలో కోతి తీవ్రంగా గాయపడింది. ప్రాణాపాయ స్థితిలో ఓ చెట్టుకొమ్మను ఎక్కి తలదాచుకుంది. ఆ సమయంలో అటుగా బైక్‌పై వెళ్తున్న ప్రభుకి గాయాలతో చెట్టుకొమ్మపై ఉన్న కోతి పిల్ల కంటబడింది. ఇది గమనించిన ప్రభు వెంటనే కుక్కలను పారదోలి.. కోతిని రక్షించాడు. దానికి నీళ్లు తాగించినా అప్పటికే అచేతన స్థితిలోకి వెళ్లిపోయింది.

దీంతో తన స్నేహితుడితో కలిసి కోతిని తీసుకుని చికిత్స కోసం వెటర్నరీ హాస్పిటల్ కు బయలుదేరాడు. క్రమంగా ఊపిరి తీసుకోడానికి కోతి ఇబ్బంది పడటంతో వెంటనే వాహనం నిలిపి దాని గుండెను పంపింగ్ చేయడం ప్రారంభించాడు. తర్వాత దాని నోటిలో నోరు పెట్టి ఊపిరి అందించడానికి ప్రయత్నించాడు. దాదాపు నిమిషం పాటు కోతికి సీపీఆర్ నిర్వహించిన తర్వాత అది కళ్లు తెరిచింది. అనంతరం జంతు వైద్యుని దగ్గరకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించడంతో కోతి పూర్తిగా కోలుకుంది. అనంతరం దానిని అటవీ శాఖ అధికారులకు అప్పగించాడు. ప్రభు దయార్థ హృదయం పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రభు మాట్లాడుతూ.. “గాయాలతో ఉన్న కోతి పిల్ల చెట్టుపైకి ఎక్కి అపస్మారక స్థితిలో ఉండటంతో భయపడ్డాను. దానిని పట్టుకుని నీళ్లు తాగించినా తాగులేదు. దీంతో చాలా బాధపడ్డాను. ఆ పరిస్థితుల్లో కోతిని వదలిపెట్టి వెళ్లాలనిపించలేదు. ఏం ఆలోచించకుండా దానికి నోటితో ఊపిరి అందించాలని భావించాను. చివరికి కోతి స్పృహ‌లోకి వచ్చి కళ్లు తెరవడంతో చాలా సంతోషించాను”అని అన్నారు. అయితే, ప్రభు 2010లో ప్రథమి చికిత్స కోర్సును పూర్తిచేశాడు. ఆ శిక్షణే ప్రస్తుతం కోతిని కాపాడటానికి తోడ్పడింది.