manish sisodia files bail plea in rouse avenue court today in Delhi Liquor Scam Case
Manish Sisodia Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశంలోని పలు రాజకీయ నేతలతో పాటు వ్యాపారవేత్తలను హడలెత్తిస్తోంది. దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ లతో సీబీఐ దూకుడుమీదుంది. ఈక్రమంలో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా (Manish Sisodia) ను కూడా అరెస్ట్ చేసింది. సీబీఐ సిసోడియాను విచారిస్తోంది. ఈక్రమంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సిసోడియా ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ శనివారం (మార్చి4,2023) విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి (2023) 26న అరెస్ట్ అయిన మనీశ్ సిసోడియా ప్రస్తుతం సీబీఐ కస్టడీ (CBI Ramand)లో ఉన్నారు.
లిక్కర్ స్కాంలో అరెస్టై, సీబీఐ కస్టడీలో ఉన్న మనిశ్ సిసోడియా తన మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాను సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆమోదించారు. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన సిసోడియా సీబీఐ కస్టడీలోనే ఉన్నారు. ఆ పై సీబీఐ కస్టడీ నుంచి విడుదల కావాటానికి ఆయన ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటీషన్ వేశారు. వ్యాపారవేత్త అదానీ వ్యవహారం నుంచి దేశ ప్రజల దృష్టిని మళ్లించేందుకే మోడీ ప్రభుత్వం మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేయించిందని ఆరోపణలున్నాయి. ఆప్ నేతలు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు. మనీశ్ అరెస్ట్ ను ఖండిస్తున్నారు.
కాగా..మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేయగానే కోర్టులో హాజరపర్చిన సీబీఐ ఐదు రోజుల కస్టడీ కోరింది. సీబీఐ కోరినట్టుగానే మనీశ్ సిసోడియాను విచారించేందుకు కోర్టులో మార్చి 3 వరకు సీబీఐ కస్టడీ విధించింది. ఇవాళ్టితో ఆ కస్టడీ గడువు ముగిసింది. దీంతో సిసోడియా తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరి ఆయనకు బెయిల్ వస్తుందా? కోర్టు బెయిల్ కు అంగీకరిస్తుందా? అనేది వేచి చూడాలి.