మోదీ 3.0 క్యాబినెట్‌లో వింత.. ఓడిన నేతలకు మంత్రి పదవులు!

నరేంద్ర మోదీ 3.0 క్యాబినెట్‌లో పలు ఆశ్చర్యకర అంశాలు ఉన్నాయి. ఓడినప్పటికీ పలువురు నేతలు మంత్రి పదవులు దక్కించుకున్నారు.

Modi 3.o Cabinet: కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం కొలువుతీరింది. ప్రధాని మోదీతో పాటు 72 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ 3.0 క్యాబినెట్‌లో పలు ఆశ్చర్యకర అంశాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారిలో 37 మందికి ఈసారి చోటు దక్కలేదు. అయితే ఎంపీలుగా ఓడినవారిని క్యాబినెట్‌లోకి తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మోదీ 2.0లో సహాయమంత్రిగా పనిచేసిన ఎల్ మురుగన్ తాజా ఎన్నికల్లో ఓడినప్పటికీ ఆయనకు క్యాబినెట్‌ పదవి దక్కడం విశేషం. అయితే ఆయన రాజ్యసభలో సభ్యుడిగా ఉన్నారు.

రెండు సభల్లోనూ సభ్యుడు కాపోయినా..
పంజాబ్‌లోని లుథియానా నుంచి పోటీ చేసిన పరాజయం పాలైన బీజేపీ నేత రవనీత్ సింగ్ బిట్టూను మంత్రి పదవి వరించింది. ఆయన రాజ్యసభ కూడా కాదు. ఆయన ఇప్పుడు ఆరు నెలల్లోగా లోక్‌సభ లేదా రాజ్యసభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. 1999లో ఖలిస్తానీ ఉగ్రవాదుల దాడిలో హత్యకు గురైన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనవడే రవనీత్. ప్రస్తుతం ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్‌లో బీజేపీ ఎదుగుదలకు ఉపయోగపడతాడనే ఉద్దేశంతో ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టినట్టుగా కనబడుతోంది.

కేరళ నేతకు కేబినెట్ పదవి
కేరళలో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జార్జ్ కురియన్ ఆశ్చర్యకరంగా కేంద్ర క్యాబినెట్‌లో స్థానం సంపాదించారు. ఆయన ఏ సభలోనూ సభ్యుడు కానపప్పటికీ అనూహ్యంగా కేబినెట్ పదవి దక్కించుకున్నారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆయన దాదాపు మూడు దశాబ్దాలుగా బీజేపీలో సభ్యుడిగా కొనసాగుతున్నారు. పార్టీ మైనారిటీ విభాగంలో కీలక పదవులు నిర్వహించారు. జాతీయ మైనారిటీ కమిషన్‌కు ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. దక్షిణాదిన పార్టీని బలోపేతం చేయడానికి, కేరళలోని క్రైస్తవ వర్గానికి చేరువ కావాలన్న లక్ష్యంతో జార్జ్ కురియన్‌ను మంత్రిగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

అనురాగ్ ఠాకూర్‌కు నిరాశ
మోదీ 2.0 క్యాబినెట్‌లో సమాచార, ప్రసార శాఖ మంత్రిగా కీలకంగా వ్యవహరించిన అనురాగ్ ఠాకూర్ ఈసారి పదవి దక్కకపోవడం పరిశీలకులను ఆశ్చర్యానికి గురిచేసింది. హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ నుంచి విజయాన్ని సాధించిన ఆయనకు మంత్రి పదవి ఖాయమని అందరూ భావించారు. అయితే జేపీ నడ్డాను క్యాబినెట్‌లోకి తీసుకోవడంతో అనురాగ్ ఠాకూర్‌ను పక్కనపెట్టారని సమాచారం. హిమాచల్ ప్రదేశ్‌ నుంచి ఒకరికి మాత్రమే క్యాబినెట్ పదవి ఇవ్వాలని నిర్ణయించడంతో ఆయనకు నిరాశ తప్పలేదు.

సీనియర్లకు షాక్
తాజా ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ బీజేపీ సీనియర్ నాయకులు రవిశంకర్ ప్రసాద్, రాజీవ్ ప్రతాప్ రూడీలకు కూడా మంత్రి పదవులు దక్కలేదు. బిహార్ నుంచి 8 మందికి క్యాబినెట్‌లో చోటు దక్కినా వీరిద్దరికి మాత్రం మొండిచేయి చూపారు. గతంలో వీరిద్దరూ.. వాజపేయి, నరేంద్ర మోదీ మంత్రివర్గంలో మంత్రులుగా పనిచేశారు.

రూపాలాను నో చాన్స్
గత రెండు పర్యాయాలు నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ప్రముఖ బీజేపీ నాయకుడు పర్షోత్తమ్ రూపాలా ఈసారి తప్పుకోవాల్సి వచ్చింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్ స్థానంలో భారీ విజయాన్ని సాధించినప్పటికీ మోదీ 3.0 క్యాబినెట్‌లో స్థానం సంపాదించలేకపోయారు. ఎన్నికలకు ముందు క్షత్రియులపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని లేపాయి. మిగతా రాష్ట్రాల్లోనూ ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

Also Read: రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం వేళ.. అక్కడే కెమెరాకు చిక్కిన చిరుత?

నారాయణ్ రాణేకు మొండిచేయి
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ రాణే తాజా ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ మంత్రి పదవి దక్కించుకోలేకపోయారు. అంతకుముందు శివసేన, కాంగ్రెస్ పార్టీల్లో పనిచేసిన ఆయన 2019లో బీజేపీ చేరి మోదీ 2.0 క్యాబినెట్‌లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి అయ్యారు. ఈసారి రత్నగిరి-సింధుదుర్గ్ సీటును గెలుచుకున్నప్పటికీ మంత్రి కాలేకపోయారు.

Also Read: సరికొత్త ప్రధానిని మోదీలో చూడబోతున్నామా? ఎందుకంటే?

మరిన్ని..
మోదీ 3.0 క్యాబినెట్‌లో ఏడుగురు మహిళలకు స్థానం దక్కింది.
మోదీతో సహా ఏడుగురు మాజీ సీఎంలు మంత్రులుగా ఉన్నారు.
గత క్యాబినెట్‌లోని 30 మంది సహాయ మంత్రులకు ఈసారి చోటు దక్కలేదు.

ట్రెండింగ్ వార్తలు