Maoist Party : ఆయుధాలు వదిలేస్తాం..! మావోయిస్టుల సంచలన లేఖ.. ఆలస్యంగా వెలుగులోకి.. లేఖపై పలు అనుమానాలు..

Maoist Party : మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో విడుదలైన లేఖ ప్రస్తుతం మావోయిస్టు, పోలీసు వర్గాల్లో కలకలం రేపుతోంది.

Maoist Party

Maoist Party : మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయుధాలను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ఆగస్టు 15న రాసినట్లుగా ఉన్న లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హిందీలో విడుదలైన ఈ లేఖలో.. తాత్కాలికంగా కాల్పులు విరమిస్తామని పేర్కొన్నారు.

Also Read: PM Narendra Modi : టారిఫ్‌ల వివాదం వేళ.. మోదీకి డొనాల్డ్ ట్రంప్ ఫోన్.. ‘ఎక్స్’ వేదికగా ధన్యవాదాలు చెప్పిన ప్రధాని

2026 మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత దేశంగా మారుస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనేకమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ తో మావోయిస్టు పార్టీకి కోలుకోని దెబ్బ తగిలింది. వరుస ఎన్ కౌంటర్లలో మావోయిస్టు అగ్రనేతలు మరణించారు. దీనికితోడు భారీ ఎత్తున మావోయిస్టులు ఇటీవలి కాలంలో పోలీసులకు లొంగిపోయారు. ఈ క్రమంలో కొంతకాలం ఆయుధాలను విడిచిపెట్టాలని మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అభయ్ పేరిట విడుదలైన లేఖలో.. తాత్కాలికంగా కాల్పులు విరమిస్తామని పేర్కొన్నారు.

అభయ్ పేరిట విడుదలైన లేఖలో.. ప్రపంచ వ్యాప్తంగా, దేశంలో మారుతున్న పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ప్రధాని నరేంద్ర మోదీ, హోమంత్రి అమిత్ షా వరకు అనేక మంది ఆయుధాలు వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలవాలంటూ చేసిన విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకొని సాయుధ పోరాటం విరమించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే, ఈ అంశంపై దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఇతర మావోయిస్టు నేతలతో చర్చించుకుని తుది నిర్ణయానికి వచ్చేందుకు కనీసం నెలపాటు ప్రభుత్వం తరపున కూడా కాల్పుల విరమణ కావాలని లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. తమ పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు ఎన్ కౌంటర్ లో అమరుడు కాకముందు నుంచే శాంతి చర్చల ప్రస్తావనను ప్రభుత్వం ముందుకు తెచ్చినట్లు అభయ్ వెల్లడించారు.

ఆయుధాలు వదులుకుంటామని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖలో విజ్ఞప్తి చేశారు. తమకు ఒక నెల సమయం కావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం పెద్దలతో వీడియో కాల్ మాట్లాడేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మీడియా లేదా ఇతర అవకాశాల ద్వారా తెలపాలని లేఖలో కోరిన మావోలు.. తమ ఈ-మెయిల్ ఐడీని విడుదల చేశారు.

మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో విడుదలైన లేఖ ప్రస్తుతం మావోయిస్టు, పోలీసు వర్గాల్లో కలకలం రేపుతోంది. అయితే, మావోయిస్టుల లేఖను పోలీసు వర్గాలు ధ్రువీకరించడం లేదు. లేఖలోని వాస్తవికతను పరిశీలించాల్సి ఉందని ఛత్తీస్ గఢ్ డిప్యూటీ సీఎం, హోంమంత్రి విజయ్ శర్మ చెప్పారు. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ కూడా మావోయిస్టుల లేఖలోని వాస్తవికతను, అందులోని అంశాలను పరిశీలిస్తున్నామని అన్నారు.