Varanasi Railway Station: భారీ అగ్నిప్రమాదం.. పార్కింగ్ చేసిన 200 వాహనాలు దగ్దం.. ఎలా జరిగిందంటే?

భారీ అగ్నిప్రమాదంలో దగ్దమైన ద్విచక్ర వాహనాల్లో ఎక్కువ భాగం రైల్వే ఉద్యోగులవేనని, మంటలను అదుపులోకి తెచ్చేందుకు రెండు గంటలు సమయం పట్టిందని అధికారులు తెలిపారు.

Fire Accident in Varanasi Railway Station

Varanasi Railway Station: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోని కాంట్ రైల్వే స్టేషన్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ అగ్నిప్రమాదంలో 200 ద్విచక్ర వాహనాలు దగ్దమయ్యాయి. అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసు శాఖ అధికారులు వెంటనే ఘటన స్థలంకు చేరుకొని మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. భారీ పొగ కారణంగా ఆ ప్రాంతాన్ని దట్టమైన పొగ అలముకుంది.

 

జీఆర్పీ, ఆర్పీఎఫ్, స్థానిక పోలీస్ సిబ్బందితోపాటు పన్నెండు ఫైరింజన్ వాహనాల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు అధికారులు శ్రమించారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు అయినట్లు సమాచారం లేదు. అయితే, 200 ద్విచక వాహనాలు దగ్దం అయ్యాయి. పోలీసులు ఈ ఘటనపై ప్రాథమిక విచారణ చేపట్టగా.. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్లు నిర్ధారించారు. కొన్ని సైకిళ్లు కూడా ఈ అగ్నిప్రమాదంలో దగ్దం అయ్యాయి. ఈ ఘటనపై జీఆర్పీ సీవో కున్వర్ బహుదూర్ సింగ్ మాట్లాడుతూ.. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై దర్యాప్తు నిర్వహిస్తున్నాం అని తెలిపారు.

 

భారీ అగ్నిప్రమాదంలో దగ్దమైన ద్విచక్ర వాహనాల్లో ఎక్కువ భాగం రైల్వే ఉద్యోగులవేనని, మంటలను అదుపులోకి తెచ్చేందుకు రెండు గంటలు సమయం పట్టిందని అధికారులు తెలిపారు. ఈ ఘటన గురించి ఓ ప్రయాణికుడు మాట్లాడుతూ.. ‘నేను నా ద్విచక్ర వాహనాన్ని అర్ధరాత్రి 12గంటల సమయంలో పార్కింగ్ చేశాను. అప్పటికే రాత్రి 11గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగిందని, మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారని వాహన పార్కింగ్ దగ్గర ఉన్న వ్యక్తుల్లో ఒకరు తెలిపాడు. నేను బైక్ పార్కింగ్ చేసిన వెళ్లిన కొన్ని గంటల తరువాత భారీ అగ్నిప్రమాదం జరిగిందని బయట ఒక ప్రయాణికుడు నాకు చెప్పాడు. నేను త్వరగా వెళ్లి నా ద్విచక్ర వాహనాన్ని అవతిలివైపు పార్కింగ్ చేశాను. కానీ, కొద్దిసేపటికే మంటలు పార్కింగ్ లో వ్యాపించాయి. చూస్తుండగానే బైక్ లు దగ్దమయ్యాయని పేర్కొన్నాడు.