Chinnaswamy Stadium Stampede: చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట.. భారీగా పెరిగిన మరణాల సంఖ్య

చిన్నస్వామి స్టేడియం ఘటనపై కాంగ్రెస్, బీజేపీ మాటల యుద్ధానికి దిగాయి. అభిమానులకు భద్రత కల్పించడంలో సిద్ధరామయ్య సర్కార్ విఫలమైందని బీజేపీ మండిపడింది.

Chinnaswamy Stadium Stampede: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటలో మరణాల సంఖ్య పెరిగింది. 11 మంది అభిమానులు చనిపోయారు. 33మంది గాయపడ్డారు. బాధితులను బౌరింగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తొక్కిసలాట జరిగిన సమయంలో స్పాట్ లోనే కొందరు చనిపోయారు. మరికొందరు ఆసుపత్రికి తరలించే క్రమంలో, ఇంకొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

స్టేడియం దగ్గరికి భారీగా తరలివచ్చిన అభిమానులు.. స్టేడియంలోకి ఒక్కసారిగా దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. గేట్ 6 నుంచి భారీ సంఖ్యలో స్టేడియంలోకి వెళ్లేందుకు యత్నించారు. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఊపిరాడక స్పాట్ లోనే కొందరు మరణించారు. గాయపడిన వారికి శివాజీనగర్ లోని బౌరింగ్, లేడీ కర్జన్ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. తొక్కిసలాట ఘటన తర్వాత స్టేడియానికి వెళ్లే మార్గాలన్నీ మూసివేశారు పోలీసులు. రద్దీని నియంత్రించేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో అనేక మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.

చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట ఘటనపై కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరం అన్నారు. ఊహించని విధంగా భారీగా తరలివచ్చిన అభిమానులను అదుపు చేయలేకపోయామన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన క్షమాపణ చెప్పారు. అటు తొక్కిసలాట ఘటనలో గాయపడి బౌరింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కర్నాటక సీఎం సిద్ధరామయ్య పరామర్శించారు.

చిన్నస్వామి స్టేడియం ఘటనపై కాంగ్రెస్, బీజేపీ మాటల యుద్ధానికి దిగాయి. అభిమానులకు భద్రత కల్పించడంలో సిద్ధరామయ్య సర్కార్ విఫలమైందని బీజేపీ మండిపడింది. అయితే, ఊహించని స్థాయిలో అభిమానులు భారీగా రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.