×
Ad

Himachal Bus Incident: ఘోర ప్రమాదం.. బస్సులోని 18 మంది ప్రయాణికులు మృతి..

ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Himachal Bus Incident: హిమాచల్ ప్రదేశ్ బిలాస్ పూర్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సుపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో 18 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు హర్యానా రోహ్ తక్ నుంచి గుమర్ విన్ కు వెళ్తోంది. బిలాస్ పూర్ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో భారీ వర్షం పడుతోంది. దాంతో కొండచరియలు విరిగి బస్సు మీద పడ్డాయి. బస్సు నుంచి 15 మంది మృతదేహాలను అధికారులు వెలికితీశారు. బిలాస్ పూర్ లో వర్షం కుమ్మేసింది. మంగళవారం అక్కడ 12.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం సాయంత్రం 6.30గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీలను తీసుకొచ్చి శిథిలాలను తొలగిస్తున్నారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. అర్థరాత్రి వరకు రెస్క్యూ, సహాయక చర్యలు కొనసాగే అవకాశం ఉంది.

కొండచరియలు విరిగిపడి 18 మంది దుర్మరణం చెందారని తెలిసి ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడ్డ వారికి ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్స అందించాలన్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ 2లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.