Kochi Water Tank Collapses
Kochi Water Tank Collapses : కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో సోమవారం తెల్లవారుజామున ఊహించని ఘటన చోటు చేసుకుంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా వరద నీరు ఇండ్లపైకి దూసుకురావడంతో పలు ఇండ్లు దెబ్బతినగా.. వాహనాలు కొట్టుకుపోయాయి. అయితే, ఈ వరద నీరు వచ్చింది చెరువు కట్ట తెగడం వల్లనో.. నదిలోకి ఒక్కసారిగా వరద నీరు పోటెత్తడం వల్లనో కాదు.. ఓ కేడబ్ల్యూఏ వాటర్ ట్యాంక్ కూలడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుంది.
కేరళలోని తమ్మనం వద్ద కేరళ వాటర్ అథారిటీ(కేడబ్ల్యూఎ)కి చెందిన ఫీడర్ ట్యాంక్‌లో ఒక భాగం కూలిపోయింది. 1.35కోట్ల లీటర్ల నిల్వ సామర్థ్యం గల తాగునీటి ట్యాంకు పగిలిపోవడంతో ఆ నీరంతా సమీపంలోని ఇండ్లపైకి ఉప్పెనలా దూసుకొచ్చింది. సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిద్రమత్తులో ఉన్న ప్రజలు వరద నీరు ఇండ్లలోకి రావడాన్ని గమనించి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పలువురు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా చిన్నపాటి చెరువును తలపించింది.
Also Read: Gold Rate Today : బంగారం, వెండి ధరల్లో ఊహించని మార్పులు.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ రేటు ఎంతంటే?
భారీ స్థాయిలో వరద ఇండ్లపైకి దూసుకురావడంతో పలు ఇండ్లకు సంబంధించి పైకప్పులు కొట్టుకుపోయాయి. అనేక ఎలక్ట్రిక్ పరికరాలు, ఫర్నీచర్ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. సమీపంలోని ఆరోగ్య కేంద్రంలోకి నీరు చేరడంతో పెద్ద మొత్తంలో మందులు, వైద్య పరికరాలు పాడైనట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై ఎర్నాకుళం ఎమ్మెల్యే టిజే వినోద్ మాట్లాడుతూ.. వాటర్ ఒకవైపు భాగం కూలిపోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. తొలుత వరద నీరు 10 ఇళ్లలోకి చేరింది. ఆ ప్రాంతంలో పార్కు చేసిన వాహనాలు కొట్టుకుపోయాయని అన్నారు. ఇళ్ల గ్రౌండ్ ఫ్లోర్ లోని ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫర్నీచర్ దెబ్బతింది. నీరు సమీపంలోని ఆరోగ్య కేంద్రంలోకి కూడా ప్రవేశించడంతో అందులోని మందులు, పలు పరికరాలు తడిసిపోయి పనికిరాకుండా పోయాయి. ఈ వాటర్ ట్యాంక్ 50 సంవత్సరాల క్రితం నిర్మించింది. దీని నుంచే కొచ్చి, త్రిపునితుర ప్రాంతాలకు నీరు సరఫరా అవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ఘటన వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం చెల్లించాలని ఆయన కేడబ్ల్యూఏను కోరారు.
స్థానికులు మాట్లాడుతూ.. వాంటర్ ట్యాంకు కూలిపోయిన విషయం తమకు తెలియదు. తమ ఇండ్లలోకి నీరు వచ్చిన తరువాతనే విషయం తెలిసింది. ఒక్కసారిగా నీరు ఇళ్లపైకి దూసుకురావడంతో మూడు ఇళ్ల కాంపౌండ్ గోడలు దెబ్బతిన్నాయి. కొన్ని చిన్న ఇళ్లపై కప్పులు కూలిపోయాయన తెలిపారు. అయితే, కొచ్చి, ఇతర ప్రాంతాలకు నీటి సరఫరా కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు కేడబ్ల్యూఏ అధికారులు తెలిపారు.